ఉచిత వైద్య సేవలు అభినందనీయం

  • సర్పంచ్ కంభంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు

మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని సర్పంచ్ కంభంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కామినేని అకాడమీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ విభాగం, నార్కట్‌పల్లి ఆధ్వర్యంలో మండలంలోని పులిపల్పుల గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వైద్యులు దంత పరీక్షలు నిర్వహించారు. నోటి పరిశుభ్రత, దంత సంరక్షణపై అవగాహన కల్పించారు. దంత సమస్యలు ఉన్న వారికి అవసరమైన సూచనలు అందించడంతో పాటు తదుపరి చికిత్స కోసం ఆస్పత్రిని సంప్రదించాలని సూచించారు.

అనంతరం సర్పంచ్ కంభంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలను మరిన్ని గ్రామాల్లో నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పందుల అంజయ్య, కొంపల్లి వెంకన్న, బోలుగూరి నరసింహ, శివ, పాఠశాల ప్రిన్సిపల్ కళావతి, ఉపాధ్యాయుడు యూసుఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు.