తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసుకోండి…
ఉరవకొండ రూరల్, జులై 15 (ఆంధ్రప్రభ ): ఎల్ నినో ప్రభావం వలన తక్కువ నీటితో పండే పంటలైన, చిరుధాన్యాలను సాగు చేసుకోవాలని ఉరవకొండ వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకులు సత్యనారాయణ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని నెరమెట్ల, రాయంపల్లి గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడు మాట్లాడుతూ… కంది పంటను ఆగస్టు 15 తేదీ లోగా సాగు చేసుకోవచ్చన్నారు.
ఈ పంట నమోదును తప్పకుండా చేసుకోవాలన్నారు. పంటలు సాగుచేసిన ప్రతి పంటకు, వాతావరణ బీమా, పసల బీమాను ఇప్పుడు రైతులు అప్లై చేసుకోవాలని సూచించారు. వాతావరణం బీమా కింద పత్తికి చెల్లించవలసిన ప్రీమియం వేరుశెనగ 640 రూపాయలు, ఫసల్ బీమా పథకం కింద కంది పంటకు ఎకరాకు 80 రూపాయలు ఫ్యూచర్ జనరల్ ఇన్సూ రెన్స్ కంపెనీకి చెల్లించాలన్నారు. ఈ నెల ఆఖరి వరకు గడువు ఉందన్నారు. ప్రస్తుతం ఎల్ నినో కండిషన్స్ ఉండడం వలన స్వల్పకాలిక రకాలు, తక్కువ నీటితో పండే పంటలైన కొర్ర, సజ్జా రాగులు, అరికలు, సామలు సాగుచేయాలన్నారు. చిరుధాన్యాలు వాడడం వలన షుగరు, బిపి, కొలెస్ట్రాల్ లాంటి తదితర రోగాల నుండి అరికట్టడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. అక్కడక్కడ బోర్ బావుల కింద మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారని, ఇది ప్రస్తుతం ఒక నెల వయస్సు ఉందన్నారు.
దీనికి కత్తెర పురుగు వచ్చే అవకాశం ఉన్నందువలన ముందుగానే కార్ టాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలను మొక్కజొన్న సుడిలో వేసినచో దీనిని అరికట్టవచ్చన్నారు. వేరుశెనగ పంట పొలాలను సందర్శించారు. అనంతరం రైతులకు ఉచితంగా కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఏఈవో భరత్ రాజ్, ఏఈవో వెంకట రమణ, ఏ/సి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి శ్రీనివాసులు, గ్రామ రైతు సేవా సహాయకురాలు త్రిపుర, వన్నారెడ్డి, నెట్టప్ప రెడ్డి, ఎర్రి స్వామి, పర్వతప్ప, రంగారెడ్డి, భీమప్ప, కేసన్న తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా రాయంపల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మొక్కజొన్న పంట పొలాలను సందర్శించి రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెన్నాహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ రేగటి నాగరాజు, ఓబులు రెడ్డి, రైతు సేవా సహాయకురాలు కవిత, తదితరులు పాల్గొన్నారు.
