చౌటుప్పల్‌లో ‘గులాబీ’ సమరం

  • కాంగ్రెస్ వైఫల్యాలు, నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ధర్నా
  • ​వలిగొండ రోడ్డు పనులను వేగవంతం చేయాలి.. అక్రమ నిర్మాణాలను కూల్చేయాలి
  • మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి డిమాండ్

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ రోడ్డు అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ, అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం భారీ ధర్నా నిర్వహించారు.

పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రమాదకరంగా మారిన గుంతల రోడ్డును, అక్రమ నిర్మాణాలను, కల్వర్టు పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం రోడ్డుపైనే బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

​ప్రజా సమస్యలపై సమరశంఖం..

వలిగొండ రహదారి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని, ​తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రత్యేక చొరవ తీసుకుని వలిగొండ రహదారి నిర్మాణానికి అనుమతులు తీసుకువచ్చి, పనులు వేగంగా జరిగేలా చూశానని కూసుకుంట్ల గుర్తుచేశారు. ​కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ పనులు పూర్తిగా నిలిచిపోయాయని, దీంతో నిత్యం ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

మూడు వెంట్లు కాదు – ఆరు వెంట్లతో కల్వర్టు నిర్మించాలి

​వలిగొండ రోడ్డులో కాలువపై నిర్మిస్తున్న కల్వర్టుకు కేవలం మూడు వెంట్లు మాత్రమే ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ​భారీ వర్షాలు, వరదల సమయంలో వరద నీరు సరిగ్గా వెళ్లే మార్గం లేక వెనుక ఉన్న కాలనీలన్నీ జలమయమయ్యే ముప్పు ఉందన్నారు. గతంలో భారీ వర్షాలు వల్ల చౌటుప్పల్ చెరువు అలుగు పారి వచ్చిన వరదలకు చౌటుప్పల్ పట్టణం చాలావరకు ముగి పోయిందన్నారు.

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కనీసం ఆరు వెంట్లతో కల్వర్టు నిర్మించాలని అధికారులను డిమాండ్ చేశారు. ​కాలువకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ ఒక మున్సిపల్ కౌన్సిలర్ కేవలం 200 గజాలకు అనుమతి తీసుకుని, ఏకంగా 500 గజాల్లో భారీ అక్రమ భవనం నిర్మిస్తున్నారని ఆరోపించారు. ​ఈ అక్రమ నిర్మాణంపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేసినా స్థానిక ఎమ్మెల్యే ఒత్తిళ్ల వల్లే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

​ఎమ్మెల్యేకు మంత్రి పదవిపైనే మోజు.. ప్రజా సమస్యలు పట్టవా?

​స్థానిక ఎమ్మెల్యేకు నియోజకవర్గ ప్రజల సమస్యల కంటే తన మంత్రి పదవిపైనే ఆసక్తి ఎక్కువ. మునుగోడు నియోజకవర్గానికి ఆయన సాధించింది శూన్యం. ఆయన అనుచరులు అక్రమ కట్టడాలు, దందాలు, భూ దోపిడీలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.

​ట్రాఫిక్ నరకం.. ప్రమాదాల ముప్పు!

​చౌటుప్పల్‌ పట్టణంలో బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యం వల్ల ట్రాఫిక్ సమస్య జటిలమైందని కూసుకుంట్ల ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్ల దుస్థితి వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రమాదకరమైన డ్రైనేజీ పిల్లర్లపై ప్రయాణించాల్సి వస్తోందని, కొన్ని చోట్ల పిల్లర్లు కుంగిపోయి ప్రాణాంతకంగా మారాయని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ​

ఈ ప్రజా నిరసన కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల పార్టీ కన్వీనర్ గిర్కటి నిరంజన్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్, పార్టీ మున్సిపల్ కన్వీనర్ ​బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి ​మున్సిపల్ కౌన్సిలర్లు కొయ్యడ శేఖర్ గౌడ్, ఊదరి యాదయ్య, ఇందిర రాజారత్నం, ​పార్టీ ముఖ్య నేతలు కొత్త పర్వతాలు యాదవ్, ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, గుండెబోయిన ఇస్తారి యాదవ్, కాకి సుందర్, తాడూరి పరమేష్, ఢిల్లీ మాధవరెడ్డి, శంకర్ రెడ్డి, చెవగొని మహేష్, కానుగు శివ తదితరులు పాల్గొన్నారు.