కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి
- బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రాచపూర్ గ్రామంలో రూ.10 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల సమగ్రాభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
అనంతరం లక్ష్మణచాంద మండల కేంద్రంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న ఆహార ధాన్యాల నిల్వ గోదాం నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని శాస్త్రీయ పద్ధతిలో భద్రపరిచేందుకు ఈ గోదాం ఎంతో ఉపయోగపడుతుందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ రమాకాంత్, సర్పంచులు బూసి మహేష్, ఓస కవిత రాజు, బీజేపీ మండల అధ్యక్షుడు చిన్నయ్య, నాయకులు అడ్వాల రమేష్, ముత్యం రెడ్డి, పోశెట్టి, రాజు, రంజిత్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
