భద్రాద్రి జిల్లాలో భూ ప్రకంపనలు
భద్రాద్రి జిల్లాలో భూ ప్రకంపనలు
భద్రాద్రి కొత్తగూడెం, (ఆంధ్రప్రభ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాల్లో ఒక్కసారిగా నేల స్వల్పంగా కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదని స్పష్టం చేశారు.
భూ ప్రకంపనలు రావడంతో కొంతమంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, మళ్లీ భూకంపం సంభవించే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని అధికారులు సూచించారు. భూపొరల్లో స్వల్ప కదలికల కారణంగా అప్పుడప్పుడు ప్రకంపనలు రావడం సహజమని, ప్రజలు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
