ఘనంగా నివాళులు..

ఘనంగా నివాళులు..
జయంతి సందర్భంగా పోలీసుల ఘన నివాళులు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల జయంతి సందర్భంగా జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ దేవదాస్ కవయిత్రి ఆతుకూరి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ దేవదాస్ మాట్లాడుతూ ఆతుకూరి మొల్ల తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప కవయిత్రి అని అన్నారు.

రామాయణాన్ని సులభమైన పదాలతో తెలుగులో రచించి సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా అందించడం ఆమె గొప్పతనమని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని తనదైన సరళమైన శైలిలో తెలుగులో అందించడం తెలుగు సాహిత్యానికి గొప్ప సంపదగా నిలిచిందన్నారు. తెలుగులో రామాయణాన్ని రచించిన తొలి కవయిత్రిగా మొల్లమాంబ పేరు ప్రఖ్యాతలు గాంచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. డి.ఎస్.పీ మహబూబ్ బాష, ఆర్.ఐ. సుధాకర్, చంద్రశేఖర్‌తో పాటు ఏ.ఆర్. సిబ్బంది పాల్గొని కవయిత్రి ఆతుకూరి మొల్లకు ఘన నివాళులు అర్పించారు.
