భారీ వర్షానికి రోడ్డుపై కూలిన చెట్టు

వేల్పూర్, ఆంధ్రప్రభ: వేల్పూర్ మండలం అమీనాపూర్ నుంచి ఆర్మూర్ వెళ్లే రైల్వే బ్రిడ్జి ప్రధాన రహదారిపై గురువారం భారీ వర్షానికి ఓ పెద్ద చెట్టు నేలకూలింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రహదారి పక్కన ఉన్న చెట్టు వేళ్లతో సహా పెకిలి రోడ్డు మధ్యలో పడిపోవడంతో వేల్పూర్–ఆర్మూర్ మార్గంలో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో రెవెన్యూ, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్ల వెంబడి ఉన్న పాత చెట్లు కూలే ప్రమాదం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.