ముమ్మరంగా ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ

ఇంటింటికీ వెళ్లి నమోదు ఫారాలు పంపిణీ చేస్తున్న బీఎల్‌ఓలు

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగనున్నట్లు తహసీల్దార్ కిరణ్‌కుమార్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

భీమ్‌గల్ మండలంలోని పురాణిపేట్ గ్రామంలో శుక్రవారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తూ ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు.

అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చూడడం, డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించడం ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ప్రజలు ఎన్యుమరేషన్ ఫారాలను సక్రమంగా పూరించి సంబంధిత అధికారులకు అందజేయడంతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించి సర్వేకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలన అధికారి రిక్కా దత్తాత్రేయ, బీఎల్‌ఓ ప్రశాంత్, వీఆర్‌ఏ చరణ్ పాల్గొన్నారు.