అద్దె బస్సులతో రవాణా పునరుద్ధరణ..

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకున్న నేపథ్యంలో అచ్చంపేటలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ పి.ఎం.డి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నాలుగు గంటల నుంచే అద్దె బస్సులను రంగంలోకి దింపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

పరిమిత వనరులతో సేవలు
అచ్చంపేట డిపోలో మొత్తం 58 ప్రభుత్వ బస్సులు, 27 అద్దె బస్సులు ఉన్నప్పటికీ, సమ్మె కారణంగా గురువారం ఒక్క ప్రభుత్వ బస్సు మాత్రమే నడిపించారు. అయితే 27 అద్దె బస్సులను నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మద్దిమడుగు మార్గాల్లో నడిపిస్తూ రవాణా సౌకర్యాన్ని కొనసాగించారు. కాగా అద్దె బస్సులతో ప్రజా రవాణాను పునరుద్ధరించినట్టు తెలియని ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది

5-6 వేల మంది ప్రయాణం

ప్రజా రవాణా రోజువారి కంటే సుమారు 62 శాతం మేర తగ్గినా, గురువారం ఒక్కరోజే 5 నుండి 6 వేల వరకు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను వినియోగించారు. అద్దె బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రజలు కొంతవరకు ఉపశమనం పొందారు.

పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో శాంతియుత నిరసన

ఇదిలా ఉండగా, అచ్చంపేట డిఎస్పీ పల్లె శ్రీనివాస్ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కార్మికులు ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీయకుండా శాంతియుతంగా నిరసన తెలిపారు. బుధవారం రాత్రి తమ నిరసన దీక్ష టెంట్లను తొలగించడమే కాక గురువారం తలపెట్టిన వంట వార్పు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డిపో నుండి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

హామీల అమలుపై కార్మికుల డిమాండ్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తూ, తమ నిరసనను ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు.

Leave a Reply