Trafic Police | ట్రాఫిక్ నియమాలపై అవగాహనలో ప్రభుత్వ ఉద్యోగులే ముందుండాలి

Trafic Police | ట్రాఫిక్ నియమాలపై అవగాహనలో ప్రభుత్వ ఉద్యోగులే ముందుండాలి
- ఎరైవ్–అలైవ్ క్యాంపెయిన్‌తో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
- పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
Trafic Police | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : ట్రాఫిక్ నిబంధనలు తాము పాటించడమే కాకుండా, ఇతరులు కూడా తప్పనిసరిగా అనుసరించేలా ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. “ఎరైవ్–అలైవ్ క్యాంపెయిన్”లో భాగంగా గోదావరిఖని పోలీసుల ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా భావించి ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

సమాజంలో గౌరవ స్థానంలో ఉన్న ఉద్యోగులు తమ భద్రత, రక్షణపై సరైన ఆలోచనలను ప్రజలకు వివరించినప్పుడు ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమన్వయంతో నగర పాలక సంస్థ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు సమష్టిగా కృషి చేస్తేనే ప్రమాదాల నియంత్రణ సాధ్యమని ఆయన అన్నారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు వెడల్పు పెంపుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను నగర పాలక సంస్థ అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాలు తరచుగా నిర్వహిస్తూ, వాటి సూచనలను కార్యాచరణలో పెట్టుతున్నామని చెప్పారు. పోలీస్ అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలను నగర పాలక సంస్థ స్వీకరిస్తోందని, టైమ్ మేనేజ్‌మెంట్ పాటిస్తే ప్రమాదాలు కొంతవరకు నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ దిశగా నగర పాలక సంస్థ సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి మాట్లాడుతూ… “ఎరైవ్–అలైవ్ క్యాంపెయిన్” ఉద్దేశ్యాన్ని వివరించడంతో పాటు, రోడ్డు ప్రమాదాల్లో కుటుంబాలు ఎదుర్కొనే బాధలను తెలియజేశారు. ట్రాఫిక్ ఏసీపీ సి.హెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని హెచ్చరించారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ మాట్లాడుతూ… రోడ్డు ప్రమాద బాధితులను సత్వరంగా ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి కాపాడితే ప్రభుత్వం నగదు పురస్కారం అందిస్తోందని, అలాగే బాధితులకు రూ.1.50 లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి ఆర్‌ఎంఓ కృపా భాయ్, గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి, రవాణా శాఖ అధికారి లింగయ్య, ఆర్ అండ్ బి, ఆర్టీసీ, మున్సిపల్ తదితర ప్రభుత్వ సంస్థల అధికారులు, సిబ్బంది, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
