సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి: టీబీజీకేఎస్
ఎన్నికలు లేకుంటే అధికారిక కార్యక్రమాలు అడ్డుకుంటామని హెచ్చరిక
గోదావరిఖని, ఆంధ్రప్రభ: సింగరేణి బొగ్గు పరిశ్రమలో గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని, లేనిపక్షంలో సెప్టెంబర్ 9 నుంచి కంపెనీలో జరిగే అధికారిక కార్యక్రమాలను అడ్డుకుంటామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు.
సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 8తో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు నిర్వహించని పక్షంలో కంపెనీ అధికారిక కార్యక్రమాల్లో అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాధాన్యం కల్పించాలని కోరారు.
ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలను కార్మికులు తిరస్కరించకపోతే బొగ్గు గని కార్మికుల హక్కులు హరించబడేవని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 9న సింగరేణి వ్యాప్తంగా చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.
కొత్త గనుల ప్రారంభం, నియామక విధానంపై స్పష్టత లేదని విమర్శించారు. క్రమశిక్షణా చర్యల పేరుతో వందలాది మంది కార్మికులను తొలగించే ప్రయత్నాలను ఖండించారు. 12వ వేజ్ బోర్డు అమలు కోసం కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలవనున్నట్లు తెలిపారు.
బొగ్గు పరిశ్రమకు, కార్మికుల హక్కులకు భంగం కలిగించే చర్యలను సహించబోమని, అవసరమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో నాయకులు నూనె కొమురయ్య, చెల్పూరి సతీష్, శేషగిరి, జోసఫ్, సంపత్, సాయి చరణ్, రహమాన్, శ్రీనివాస్, ప్రసన్నకుమార్, సతీష్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
