గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
మెరుగైన వైద్య సేవలపై ఆదేశాలు
గోదావరిఖని, ఆంధ్రప్రభ: గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన క్రిటికల్ కేర్ సెంటర్, ఇన్‌పేషెంట్ వార్డులు, ప్రయోగశాలలు, ఎక్స్‌రే విభాగం, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి వైద్య సేవలు, పారిశుద్ధ్యం, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ నిర్వహిస్తున్న ఎక్స్‌రే పరీక్షల నివేదికను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు.
ఆసుపత్రిలో ఉన్న లిఫ్ట్‌ను మాన్యువల్ ఆపరేషన్ విధానంలోకి మార్చేందుకు చర్యలు తీసుకోవాలని, కొత్త లిఫ్ట్‌తో పాటు భద్రత కోసం ఆరు గ్రిల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే రెండు ఫ్యూమిగేటర్లు, రెండు కంప్యూటర్లు, రెండు రిఫ్రిజిరేటర్లు, ప్రయోగశాలకు ఐదు యూపీఎస్‌లు, ఒక ప్రింటర్‌ను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ద్వారా సమకూర్చాలని సూచించారు. ఆసుపత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందు, ఆర్‌ఎంఓ కృపాబాయి, వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
