Tourist hub : పర్యాటక హబ్‌గా జిల్లా

అభివృద్ధిలో పర్యాటక రంగం కీలకం
స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ గ్రోత్ ఇంజన్‌గా పర్యాటకం
టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి..
ట్రెయినీ ఐఏఎస్‌లతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాకారానికి సమ్మిళిత, సుస్థిర ఆర్థిక వృద్ధి ముఖ్యమని, ఈ ప్రగతికి పర్యాటక రంగ అభివృద్ధి చోదక శక్తి అని, జిల్లాను పర్యాటక హబ్ (Tourist hub)గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలతో కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్న 20 మంది ట్రెయినీ ఐఏఎస్ అధికారులు (trainee IAS officers) ఫీల్డ్ స్టడీ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కింద జిల్లాలో పర్యటిస్తున్నారు. కలెక్టర్ లక్ష్మీశ బుధవారం ట్రెయినీ ఐఏఎస్ అధికారులతో కలిసి కొండపల్లి ఖిల్లాకు ట్రెక్కింగ్ చేశారు. ఖిల్లా చారిత్రక వైభవాన్ని వివరించారు. స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేస్తే చాలు.. చారిత్రక నేపథ్యం గురించి సమాచారం లభించే సాంకేతికత ట్రెయినీ ఐఏఎస్‌లకు వినూత్న పర్యాటక అనుభవాన్ని అందించింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టెంపుల్ టూరిజం (temple tourism), ఎకో టూరిజం (eco-tourism)లో మంచి అభివృద్ధికి అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో పర్యాటకులకు మధురానుభూతులు మిగిల్చేలా పర్యాటక ప్యాకేజీలు అందుబాటులోకి తెస్తున్నామని, ఇప్పటికే టూరిజం గైడ్లుగా యువతకు శిక్షణ కూడా ఇచ్చామన్నారు. కొండపల్లి కోటను కూడా పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చొరవ తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, ఏపీ అడ్వెంచర్ అసోసియేషన్ (ఏపీఏఏ) ప్రెసిడెంట్ డా. తరుణ్ కాకాని, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


