కనుమూరులో అభివృద్ధి జోరు..
గ్రామాభివృద్ధి, విద్యా ప్రోత్సాహం ఆదర్శం
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు
కనుమూరు (పామర్రు), ఆంధ్రప్రభ: గ్రామాభివృద్ధి, విద్యా ప్రోత్సాహం, సామాజిక సేవలను సమన్వయం చేస్తూ కనుమూరు గ్రామంలో చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయమని ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు.
బుధవారం పామర్రు మండలం కనుమూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామ ప్రవేశ ముఖద్వారాన్ని ప్రారంభించడంతో పాటు స్వర్గపురి (శ్మశానవాటిక) అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 21 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అలాగే పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ మాట్లాడుతూ గ్రామాల్లో విద్య, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి చేపడుతున్న చర్యలు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. గ్రామాభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్న దాతలు, గ్రామ పెద్దలను ప్రత్యేకంగా అభినందించారు.
పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా ఉన్నత లక్ష్యాల వైపు వారిని ప్రేరేపించే చర్యగా అభివర్ణించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు తమ అభిరుచి, సామర్థ్యాలకు అనుగుణంగా బయాలజీ, ఆర్ట్స్, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్స్ వంటి రంగాలను ఎంచుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా రాణించాలని సూచించారు.
గ్రామం నుంచి ఉన్నత స్థానాలకు చేరుకున్న అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలు, విదేశాల్లో రాణిస్తున్న యువతను ఆదర్శంగా తీసుకుని మరింత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కోల్ ఇండియా సంస్థ సహకారంతో రూ.1.53 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులు, రూ.10 లక్షల వ్యయంతో గ్రామ ప్రవేశ ముఖద్వారం నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల కోసం కృషి చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మాట్లాడుతూ విద్యార్థులు చిన్న లక్ష్యాలతో సరిపెట్టుకోకుండా ఉన్నత ఆశయాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుని కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో సంస్థలను స్థాపించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ పామర్రు నియోజకవర్గం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు. రూ.1.53 కోట్ల వ్యయంతో స్వర్గపురి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ ముఖద్వారాన్ని ప్రారంభించామని తెలిపారు. మరో రూ.50 లక్షలతో నిర్మించిన పడమూరు గ్రామ రహదారిని ప్రజలకు అంకితం చేశామని చెప్పారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన రహదారికి ఇప్పుడు రూపుదిద్దడం సంతోషకరమన్నారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 21 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, బోడె ప్రసాద్, ఉయ్యూరు ఆర్డీఓ ఎస్. కరుణకుమారి, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, ఎండోమెంట్స్ సహాయ కమిషనర్ లలిత, దాత ఎలమంచిలి వాసుదేవరావు, విద్యార్థులు, గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
