తిరుపతి – రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం..

తిరుపతి – రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం..
తిరుపతి, ఆంధ్రప్రభ : తిరుపతి రైల్వే స్టేషన్ 6వ నంబర్ ప్లాట్‌ఫారంపై తిరుపతి –రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ రైలును ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, డీసీఎం మోహన్ కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. గుంతకల్ డివిజన్ ఆధ్వర్యంలో రైలు నం. 17433/17434 తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించగా, ఈ రైలు ఉదయం 8:15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరింది.
గతంలో 07051/07052 ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసుకు శాశ్వత హోదా కల్పిస్తూ రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్‌గా ప్రారంభించారు. ఈ రైలు తిరుపతి నుంచి బయలుదేరి రేణిగుంట, కడప, గుంతకల్, రాయచూర్, వికారాబాద్ మార్గాల ద్వారా ప్రయాణించి సికింద్రాబాద్ చేరుకుంటుంది. అనంతరం చర్లపల్లి, కాజీపేట, మంచిర్యాల, బిలాస్‌పూర్, రాంచీ, చిత్తరంజన్ తదితర ప్రధాన స్టేషన్ల మీదుగా సుమారు 2,795 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రక్సౌల్ జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈ సందర్భంగా ఈ రైలు సేవలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల మధ్య ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తాయని అధికారులు తెలిపారు. ఈ వివరాలను గుంతకల్ డివిజన్ మండల వాణిజ్య అధికారి మరియు స్టేషన్ డైరెక్టర్ మోహన కృష్ణ వెల్లడించారు.
