భవిష్యత్ తరాల కోసం పచ్చని సంకల్పం..
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
తిరుపతి కార్పొరేషన్, ఆంధ్రప్రభ: భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ శారదా దేవి పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తిరుపతిలోని ఈట్ స్ట్రీట్ సమీప డివైడర్లపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

ప్రకృతిని కాలుష్యం నుంచి రక్షించుకోవాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న కాలుష్య ప్రభావం నుంచి భూమిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి కనీస బాధ్యత అని పేర్కొన్నారు.

భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బహుమతిగా అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి, దానిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు.
“మన ప్రకృతిని కాలుష్యం నుంచి కాపాడుకుందాం” అనే నినాదంతో ప్రజల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీఈ ప్రసాద్, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
