డిండి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలి

డిండి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని కరువు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, త్రాగునీరు అందించేందుకు చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసి 3 లక్షల 61 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. చౌటుప్పల్ లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి లతో కలిసి పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జీవో నెంబర్ 107 విడుదల చేసి 11-06-2015 తేదీన చర్లగూడెం వద్ద గత ప్రభుత్వం ఈ పథకానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 3 లక్షల 41 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, చర్లగూడెం రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నాయి కానీ ఈ ప్రాజెక్టు విషయమై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నదని తెలిపారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన ఏదుల్లా రిజర్వాయర్ నుండి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీలు నీటిని తీసుకునే విధంగా డిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు అవసరమైనన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లాలో సుమారు 3 లక్షల 41 వేల ఎకరాలకు సాగునీరు వందల గ్రామాలకు త్రాగునీరు ఇచ్చే శ్రీశైలం సొరంగం పనులు పూర్తి చేసేందుకు గత ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వలన నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. ఇంకా 9.5 కిలోమీటర్లు సొరంగం తవ్వాల్సి ఉందని ఈ బడ్జెట్లో కేటాయించిన 800 కోట్లు సరిపోవని అన్నారు. పూర్తి నిధులు ఇచ్చి త్వరితగతిన పూర్తి చేయుటకు పర్యవేక్షణ కమిటీని వేయాలని కోరారు.
గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుల పై పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలోనైనా ఫ్లోరిడ్ పీడత కరువు, కాటకాలతో ఉన్న నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి డిండి ఎత్తిపోతల పథకం ,శ్రీశైల సొరంగ మార్గాన్ని తక్షణమే పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. చర్లగూడెం ప్రాజెక్టు నుండి లిఫ్ట్ ద్వారా రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటు చేసి నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, సిపిఐ నాయకులు బద్దుల సుధాకర్, రొండి నరసింహ, కొండూరు వెంకటేష్, టంగుటూరి రాములు, దాసరి మనోహర్, శనిగల వెంకటేష్, సికిల్ మెట్ల రమేష్, కొత్త వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
