సాంబార్ జింక వేట కేసు ఛేదింపు.. 17 మంది అరెస్ట్
అచ్చంపేట (ఆంధ్రప్రభ): అచ్చంపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని పీర్ల దేవుని చెలక అటవీ ప్రాంతంలో సాంబార్ జింకను వేటాడి మాంసాన్ని పంచుకుని భుజించిన కేసును అటవీశాఖ అధికారులు ఛేదించారు. ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చగా, కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించి కల్వకుర్తి సబ్‌జైలుకు తరలించాలని ఆదేశించింది. పద్మారం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సాంబార్ జింకను వేటాడి మాంసాన్ని పంచుకున్నట్లు సమాచారం అందడంతో అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. సమగ్ర విచారణ అనంతరం నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా అచ్చంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎం.ఏ. సుబూర్, లింగాల రేంజ్ అధికారి ఈశ్వర్, స్ట్రైక్ ఫోర్స్ రేంజ్ అధికారి మగ్దూం హుస్సేన్ మాట్లాడుతూ డిప్యూటీ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, బేస్ క్యాంప్ వాచర్లు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో కేసును ఛేదించగలిగామని తెలిపారు. వన్యప్రాణులను వేటాడడం, మాంసాన్ని నిల్వ చేయడం, కొనుగోలు, విక్రయాలు, రవాణా లేదా వినియోగం చేయడం వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. అడవుల్లో వేట లేదా అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
అయితే ఈ ఘటన జూలై 24న జరిగినప్పటికీ, నిందితుల అరెస్టు విషయాన్ని అటవీశాఖ ఐదు రోజుల తర్వాత మాత్రమే పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించడం చర్చనీయాంశమైంది. సమాచారం ఆలస్యంగా బయటకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, సిద్ధాపూర్ బేస్ క్యాంప్ వాచర్ నిరంజన్ నిర్లక్ష్యం వల్లే ఈ జాప్యం జరిగిందని అచ్చంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎం.ఏ. సుబూర్ తెలిపారు. అతనిపై శాఖాపరమైన విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
