ఆ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
వరంగల్/హనుమకొండ (ఆంధ్రప్రభ): ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాతావరణ వ్యవస్థల ప్రభావంతో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాలు, చెరువులు, వాగులు, కాలువల సమీపంలో నివసించే ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రైతులు పంట పొలాల్లో నీరు నిల్వ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం వర్ష పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరింది. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.
