Minority Gurukul School | పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే
తాత్కాలిక వంతెన నీటమునిగిపోవడంతో విద్యార్థులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
Minority Gurukul School | ఖానాపూర్, ఆంధ్రప్రభ: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 104 శాతం వర్షపాతం నమోదవడంతో ఖానాపూర్ పట్టణంలోని రెయిన్కోన్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.
మైనారిటీ గురుకుల పాఠశాలకు వెళ్లే మార్గంలో వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన పూర్తిగా నీటమునిగిపోవడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాఠశాలకు రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి.
వాగు అవతల నివసిస్తున్న ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం కూడా ఈ వాగును దాటాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే విద్యార్థులకు బోధన నిర్వహించేందుకు ఉపాధ్యాయులు కూడా వాగు దాటక తప్పడం లేదు.
ప్రతి వర్షాకాలంలో తాత్కాలిక వంతెన నీటమునిగిపోవడం వల్ల కాలనీవాసులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత వంతెన నిర్మించి, విద్యార్థులు, ప్రజలకు సురక్షిత రాకపోకల సౌకర్యం కల్పించాలని కాలనీవాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
