ఎడతెరిపి వర్షం.. జలమయమైన గోదావరిఖని కాలనీలు

గోదావరిఖని (ఆంధ్రప్రభ): మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో పాటు డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఫైవ్ ఇంక్లైన్ ఏరియా, టూ ఇంక్లైన్ మోరి ప్రాంతం, రాంనగర్, ఎల్‌బీనగర్, మార్కండేయ కాలనీ దిగువ ప్రాంతం, మల్కాపూర్, సప్తగిరి కాలనీ తదితర ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల కాలనీవాసులు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

వర్ష పరిస్థితులను నగర మేయర్ మహంకాళి స్వామి స్వయంగా పరిశీలించి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్‌రెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సీఐ ఇంద్రసేనారెడ్డి కూడా జలమయమైన ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.