FormerMinister | పోలీస్ నియామకాలపై హరీశ్ ఫైర్
FormerMinister | పోలీస్ నియామకాలపై హరీశ్ ఫైర్
FormerMinister | 5 వేల పోస్టులు కాదు.. అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలి
నిరుద్యోగుల పక్షాన హరీశ్‌రావు.. పోలీస్ ఉద్యోగాలపై కీలక డిమాండ్లు
వయోపరిమితి పెంచాలి.. అప్లికేషన్ ఫీజులు రద్దు చేయాలి: హరీశ్‌రావు
FormerMinister | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోలీస్ పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతతో సమావేశమైన హరీశ్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 19 వేల పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అలాంటప్పుడు కేవలం 5 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఖాళీగా ఉన్న మొత్తం 19 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసి యువతకు న్యాయం చేయాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. పోలీస్ నియామక ప్రక్రియలో వయోపరిమితిని పునరుద్ధరించాలని కూడా హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 36 సంవత్సరాలకు, సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని సూచించారు. నోటిఫికేషన్లు ఆలస్యం కావడం వల్ల లక్షలాది మంది యువత వయోపరిమితి దాటి అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, గతంలో అమలు చేసిన పోలీస్ నియామకాల ఈవెంట్స్ విధానాన్నే కొనసాగించాలని కోరారు. నియామక ప్రక్రియలో పారదర్శకత, న్యాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులపై ఆర్థిక భారం పడకుండా అప్లికేషన్ ఫీజులను పూర్తిగా రద్దు చేసి ఉచితంగా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
