ట్రంప్–రక్షణ మంత్రి మధ్య విభేదాలా? ఇరాన్ యుద్ధ వ్యూహంపై కొత్త చర్చ
- ఇరాన్‌పై ట్రంప్ దూకుడు తగ్గిందా?
- ఆయుధ నిల్వలపై వెలుగులోకి వస్తున్న కథనాలు
- ట్రంప్–పీట్ హెగ్సెత్ మధ్య వాగ్వాదం జరిగిందా?
- వైట్ హౌస్, పెంటగాన్ వివరణలు
- ఇరాన్ యుద్ధంపై అమెరికా వ్యూహంలో మార్పు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దూకుడు తగ్గించినట్టే కనిపిస్తోంది. ఇందుకు కారణం, అమెరికా ఆయుధాగారం నిండుకోవడమేనా? అనే అంశంపై వాషింగ్టన్‌లోని మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి.
ఈ విషయమై క్యాంప్ డేవిడ్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మధ్య ఘాటుగా వాగ్వాదం జరిగినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఖండించారు. వారిద్దరి మధ్య ఎప్పుడూ లేనంతగా సత్సంబంధాలు ఉన్నాయని ఆమె ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
అయితే, అమెరికా వద్ద క్షిపణుల సంఖ్య బాగా తగ్గిందని, అందుకే ఇరాన్ నగరాలపై క్షిపణుల దాడులు తగ్గాయన్న వార్తలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ఇరాన్‌పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన దాడులకన్నా భీకరమైన దాడులు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, అయితే ఇరాన్‌కు తమ దేశం ఇస్తున్న చివరి అవకాశం ఇదేనని అన్నారు.
ఇరాన్ వద్ద క్షిపణులు అధిక సంఖ్యలో ఉన్నాయని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. క్షిపణుల దాడుల్లో ఇరాన్ జోరును అమెరికా తట్టుకోలేకపోతున్నదన్న వార్తలు కూడా వచ్చాయి.
ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా ఆయుధాగారంలో క్షిపణుల సంఖ్య తరిగిపోతున్నదని, ఈ విషయమై హెగ్సెత్ ట్రంప్‌కు ఎప్పటికప్పుడు తెలియజేయకపోవడం వల్లనే ట్రంప్ దూకుడు ప్రకటనలు చేశారని తెలుస్తోంది.
అయితే, అది నిజం కాదని, అమెరికా ఆయుధాల నిల్వల పరిస్థితి గురించిన సమాచారాన్ని హెగ్సెత్ ఎప్పటికప్పుడు ట్రంప్‌కు తెలియజేస్తున్నారని పెంటగాన్ వర్గాలు తెలిపాయి.
ఆయుధాలు తరిగిపోతున్నాయన్న సమాచారం తెలిసిన వెంటనే ట్రంప్ కోపోద్రిక్తులు అయినట్టు తెలుస్తోంది. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి అమెరికా ప్రయోగిస్తున్న క్షిపణుల సంఖ్యను లెక్కగట్టినట్టయితే, అమెరికా ఆయుధ నిల్వల పరిస్థితి చాలా దారుణంగా పడిపోయినట్టు తెలుస్తోంది.
ట్రంప్ రక్షణ శాఖను సంప్రదించకుండా యుద్ధ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ చౌకగా తయారు చేసిన క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తుండగా, అమెరికా ప్రయోగించే క్షిపణులు చాలా ఖరీదైనవి.
ఇరాన్ దళాల దాడిలో అమెరికాకు చెందిన థాడ్, పేట్రియాట్ వంటి క్షిపణులను ఎక్కువగా ప్రయోగించింది. ఈ కారణంగా వాటి కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ట్రంప్‌కు అందుతున్నా, తనకెందుకు చెప్పలేదంటూ హెగ్సెత్‌పై ట్రంప్ ఆగ్రహించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య వాగ్వాదానికి అసలు కారణం ఇదేనని కథనాలు చెబుతున్నాయి.
అంతేకాక, యుద్ధం కొనసాగించలేమని అమెరికన్ రక్షణ నిపుణులు ట్రంప్‌ను ముందే హెచ్చరించినట్టు తెలిసింది. ఆయుధాల కొరత కారణంగా ఇరాన్‌పై పూర్తి స్థాయిలో యుద్ధాన్ని చేపట్టలేని పరిస్థితి వచ్చిందని తెలియగానే ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అయితే, ఇది నిజం కాదని పెంటగాన్ వర్గాలు తెలుపుతున్నాయి.
మొత్తం మీద అమెరికా అధ్యక్షుడికీ, రక్షణ మంత్రికీ మధ్య సరైన అవగాహన లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య విభేదాల గురించి బయటకు పొక్కకుండా చూడాలని రక్షణ మంత్రిత్వ శాఖ ఎంత ప్రయత్నించినా అవి లీక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ దూకుడు తగ్గించినట్టు తెలుస్తోంది.
