పాఠశాలలో పాము కలకలం..

మక్తల్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కాట్రేవుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం పాము ప్రత్యక్షమవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం పాఠశాల ముగిసే సమయంలో ఓ పాము తరగతి గదిలోకి ప్రవేశించడాన్ని గమనించిన విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు ఆత్కూర్ నర్సిరెడ్డి గ్రామ యువకులకు సమాచారం ఇవ్వగా, నాయకాడు లింగప్పతో పాటు పలువురు యువకులు వెంటనే పాఠశాలకు చేరుకుని పామును చంపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఇటీవల జిల్లాలోని ఎక్లాస్‌పూర్ పాఠశాలలో పాముకాటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఈ సంఘటన తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన కలిగించింది. పాఠశాలల పరిసరాల్లో ముళ్లపొదలు, చెత్తాచెదారం తొలగించి పరిశుభ్రంగా ఉంచేలా పంచాయతీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిసరాలను అధికారులు నిరంతరం పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.