వరుణ్ తేజ్‌కు మెగా యువత శుభాకాంక్షలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి రవణం స్వామినాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు.
మెగా కుటుంబం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్, తన నట జీవితంలో ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. మెగా కుటుంబ వారసత్వం ఉన్నప్పటికీ, తనదైన కథలు, పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారని అన్నారు.
‘కొరియన్ కనకరాజు’ చిత్రంలో వరుణ్ తేజ్ నటన ఆకట్టుకునేలా ఉందని, ముఖ్యంగా కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ అంశాల్లో ఆయన తన ప్రతిభను మరోసారి నిరూపించారని స్వామినాయుడు కొనియాడారు. చిత్రంలో నటుడు సత్యతో కలిసి వచ్చిన హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని పేర్కొన్నారు.
ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌లో మరో విజయవంతమైన చిత్రంగా నిలవాలని, భవిష్యత్తులో కూడా ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా మొత్తం చిత్ర బృందానికి అఖిల భారత చిరంజీవి యువత తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
