Srikakulam | తప్పిన పెను రైలు ప్రమాదం…
గూడ్స్ రైలు బోగీలు పట్టాలు తప్పడంతో కలకలం
రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పింది..
కొంతసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం
Srikakulam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లా మందస రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గూడ్స్ రైలు వెనుక బోగీల చక్రాలు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో కలకలం రేగింది. అయితే రైల్వే సిబ్బంది సమయానికి అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
గూడ్స్ రైలు వెనుక బోగీలు పట్టాలు తప్పిన విషయాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించి, పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. సిబ్బంది వేగంగా స్పందించకపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగే అవకాశముందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఘటనతో భువనేశ్వర్–విశాఖపట్నం ప్రధాన రైల్వే మార్గంలో కొంతసేపు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రయాణికుల రైళ్లు మార్గమధ్యంలోని స్టేషన్లలో నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే అధికారులు వేగంగా చేపట్టారు.
గూడ్స్ రైలు చక్రాలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక లోపమా, ట్రాక్‌లో సమస్యా లేదా ఇతర కారణాలా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
