‘కదిలే ఫైర్’.. కేటీఆర్ మెచ్చిన యువ సంగీత దర్శకుడు
‘కదిలే ఫైర్’.. కేటీఆర్ మెచ్చిన యువ సంగీత దర్శకుడు
హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన “KTR సన్ ఆఫ్ సార్.. కదిలే ఫైర్” పాటకు విశేష స్పందన లభిస్తోంది. ఈ పాటకు కేవలం 16 ఏళ్ల యువ సంగీత దర్శకుడు నిహిత్ సంభవ్ స్వరకల్పన చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటకు ప్రముఖ రచయిత్రి మల్లావజ్జల కృష్ణవేణి సాహిత్యం అందించగా, బందూక్ లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. కాకతీయ ఇన్నోవేటివ్స్ నిర్మించిన ఈ పాటను కోరుకంటి చందర్ సమర్పించారు.
2023లో సంగీతాన్ని అభ్యసించాలని నిహిత్ సంభవ్ సంకల్పించిన సమయంలో కేటీఆర్ అతడిని ఆశీర్వదించారు. అదే ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకున్న నిహిత్, 2026లో కేటీఆర్ 50వ జన్మదినోత్సవం సందర్భంగా తన తొలి స్వరకల్పనతో ఈ ప్రత్యేక గీతాన్ని అందించడం విశేషంగా మారింది. పాటను విన్న కేటీఆర్ స్వయంగా నిహిత్ సంభవ్ను అభినందించారు. చిన్న వయస్సులోనే సంగీత రంగంలో ప్రతిభ కనబరుస్తున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమ కవి మల్లావజ్జల సదాశివుడు మనవడైన నిహిత్ సంభవ్, తన తొలి సంగీత కృతితోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తెలుగు సంగీత రంగంలో ఆయన విశిష్ట స్థానం సంపాదించాలని పలువురు ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
