నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం

నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం

  • సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం

నల్లగొండ, ఆంధ్రప్రభ: నల్లగొండ పట్టణంలోని పానగల్ ఫ్లై ఓవర్ పై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సాయి సందీప్ (35) ఈ ప్రమాదంలో మృతి చెందారు.

పోలీసుల కథనం ప్రకారం.. సాయి సందీప్ తన స్వగ్రామం నరసరావుపేట నుండి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. పానగల్ ఫ్లై ఓవర్ పైకి చేరుకోగానే, ఆయన ప్రయాణిస్తున్న కారు అతివేగంతో అక్కడ నిలిపి ఉంచిన లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. సాయి సందీప్ కారులోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మరణించారు.

సమాచారం అందిన వెంటనే టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్సై సైదులు తమ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. కారు ఎంతలా ధ్వంసమైందంటే, మృతదేహాన్ని బయటకు తీయడం పోలీసులకు కష్టతరంగా మారింది. చివరికి జేసీబీ సహాయంతో కారు భాగాలను తొలగించి, మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.