పాఠశాల ప్రహరీ గోడ అడ్డుకుంటున్నారు..

పాఠశాల ప్రహరీ గోడ అడ్డుకుంటున్నారు..
గోపరపల్లిలో గ్రామస్తుల ఆందోళన
ఓదెల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారంటూ మంగళవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లి గ్రామస్తులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామ సర్పంచ్ మద్దెవేని రవి యాదవ్ ఆధ్వర్యంలో ప్రజలంతా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధులు ద్వారా కేటాయించిన ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతుండగా కొందరు ప్రైవేటు వ్యక్తులకు కొమ్ము కాస్తూ గత 25 ఏళ్ల క్రితం పాఠశాల కోసం కొనుగోలు చేసిన భూమి పై లీగల్ నోటీసు ఉందంటూ కాంట్రాక్టర్ ను భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రహారీ గోడ నిర్మాణాన్ని ఆపాలని బెదిరిస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పాఠశాల మెయిన్ రోడ్డు కు ప్రక్కనే ఉన్నందున ప్రహరీ గోడ లేనందున భవిష్యత్ లో పిల్లలకు ఏదైనా జరగరానిది జరిగితే దాని పూర్తి బాధ్యత అధికారూలే వహించాల్సి ఉంటుందని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుల్తానాబాద్- శ్రీరాంపూర్ రహదారిపై ఆందోళన చేయడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు చివరకు ఆందోళనకారుల వద్దకు వెళ్లి విరమించాలని కోరగా శాంతించారు.
