చేనేత సహకార సంఘాల రూ.35 కోట్ల రుణాలు మాఫీ చేయాలి

  • ఎంపీ నరేందర్ రెడ్డి కి పిల్లలమర్రి శ్రీనివాస్ వినతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి వాటిని గట్టెక్కించేందుకు రూ.35 కోట్ల బ్యాంకు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని, ప్రత్యేక పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించాలని, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి మాజీ డైరెక్టర్, చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల చేనేత సహకార సంఘం చైర్మన్ (పీఐసీ) పిల్లలమర్రి శ్రీనివాస్ కోరారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచన మేరకు శనివారం పిల్లలమర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేనేత ప్రతినిధుల బృందం రాజ్యసభ సభ్యులు వి. నరేందర్ రెడ్డి ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా పిల్లలమర్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేలాది మంది చేనేత కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న సహకార సంఘాలు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు.

సంఘాల పునరుజ్జీవనానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేయాలని ఎంపీ నరేందర్ రెడ్డి ని కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడానికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. చేనేత సహకార సంఘాల సమస్యలను, రుణమాఫీ అంశాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, అర్హులైన చేనేత కార్మికులకు, సంఘాలకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.