వర్తక సంఘం కుటుంబాలను ఆదుకోవాలి

వర్తక సంఘం కుటుంబాలను ఆదుకోవాలి

– దుకాణాల రెన్యూవల్‌కు వినతి

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ: లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కొండపై దుకాణాల వర్తక సంఘం సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో కమిషనర్ హనుమంతరావును కలిశారు.

ఈ సందర్భంగా వారు వర్తక సంఘానికి చెందిన దుకాణాలను రెన్యూవల్ చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. గత 50 సంవత్సరాలుగా కొండపై దుకాణాలు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నామని వారు తెలిపారు.

ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపై ఉన్న 114 దుకాణాలను తొలగించగా, పునర్నిర్మాణం అనంతరం వర్తక సంఘం ద్వారా తిరిగి దుకాణాల నిర్వహణకు అనుమతించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం వర్తక సంఘం ద్వారా 114 కుటుంబాలతో పాటు సుమారు 500 మంది జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.

దుకాణాలను తొలగిస్తే తమ జీవనాధారం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనాధారాన్ని కాపాడేలా దుకాణాలను రెన్యూవల్ చేసి ఆదుకోవాలని వారు కోరారు.