నిస్సహాయ వృద్ధురాలికి అండగా కలెక్టర్
నిస్సహాయ వృద్ధురాలికి అండగా కలెక్టర్
- ఆశ్రయం కోసం కలెక్టర్‌ను ఆశ్రయించిన 75 ఏళ్ల శారదమ్మ
- మానవతా దృక్పథంతో స్పందించి వృద్ధాశ్రమంలో చేరుస్తూ ఆదేశాలు
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : దిక్కుతోచని పరిస్థితిలో ఆశ్రయం కోసం జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించిన 75 ఏళ్ల వృద్ధురాలికి కలెక్టర్ వేంకటేశ్వర్ మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. వృద్ధురాలి పరిస్థితిని చూసి చలించిన కలెక్టర్, వెంటనే ఆమెకు వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించేలా అధికారులను ఆదేశించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన పి. శారదమ్మ తన భర్తతో కలిసి బళ్లారి పట్టణంలోని ఆలయ పరిసరాల్లో చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, భర్త మరణానంతరం ఆమెకు కుటుంబ పరంగా అండ లేకపోవడంతో జీవనం దుర్భరంగా మారింది.

దీంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారే తనకు దిక్కని భావించి తిరుపతికి చేరుకుంది. తిరుపతిలోని పలు వృద్ధాశ్రమాలను ఆశ్రయించినప్పటికీ ఎక్కడా ఆశ్రయం లభించకపోవడంతో, స్థానికుల సూచన మేరకు జిల్లా కలెక్టర్‌ను కలుసుకుని తన గోడును వెళ్లబోసుకుంది. భర్త మరణించిన తర్వాత పిల్లలు తనను ఆదుకోలేదని, జీవనాధారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె కలెక్టర్‌కు వివరించింది. వృద్ధురాలి నిస్సహాయ స్థితిని గమనించిన కలెక్టర్ వెంటనే స్పందించారు.
బీటీఆర్ కాలనీలోని రాష్ట్రీయ సేవా సమితి వృద్ధాశ్రమం ప్రతినిధులను సంప్రదించి, శారదమ్మకు ఆశ్రయం, వైద్య సేవలు, అవసరమైన సంరక్షణ కల్పించాలని దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో వెంటనే ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించే ఏర్పాట్లు పూర్తి చేశారు. తనకు ఆశ్రయం కల్పించిన జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు శారదమ్మ కృతజ్ఞతలు తెలిపింది. వృద్ధులు, నిరాశ్రయుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉందని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
