జిల్లాస్థాయి క్రికెట్ ఎంపికలకు విశేష స్పందన

జిల్లాస్థాయి క్రికెట్ ఎంపికలకు విశేష స్పందన

-సుమారు 300 మంది క్రీడాకారుల హాజరు
-అండర్ 16 అండర్ 19 విభాగాలలో 30 మంది క్రీడాకారులు ఎంపిక
-ఎంపికైన క్రీడాకారులకు మూడు నెలలపాటు ఉచిత శిక్షణ

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆదేశాల మేరకు నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి అండర్-16, అండర్-19 బాలురు, బాలికల క్రికెట్ ఎంపికలు ఘనంగా నిర్వహించారు. ఈ ఎంపికలకు జిల్లావ్యాప్తంగా విశేష స్పందన లభించగా, సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ఎంపికల సందర్భంగా క్రీడాకారుల ప్రతిభను పరిశీలించి అండర్-16 విభాగానికి 30 మంది, అండర్-19 విభాగానికి 30 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులకు మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి వెంకటరెడ్డి కోశాధికారి శ్రీనివాసరావు సంయుక్త కార్యదర్శి కోచ్ సురేష్ బాబు లు పేర్కొన్నారు.
శిక్షణ అనంతరం ప్రతిభ ఆధారంగా అండర్-16, అండర్-19 విభాగాలకు 15 మంది చొప్పున జట్లను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి మంచి ప్రతిభ వెలుగులోకి వస్తోందని, క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ తీసుకుంటే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు.
ఈ ఎంపిక కార్యక్రమంలో అసోసియేషన్ శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి సురేష్ బాబు, నయీమ్, లలిత్, విక్రమ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply