ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై గ్రామాల్లో పెరుగుతున్న అసంతృప్తి
ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై గ్రామాల్లో పెరుగుతున్న అసంతృప్తి
కాంగ్రెస్ కార్యకర్తల విముఖత.. ఎమ్మెల్యేలపై ఒత్తిడి
మంత్రి పొంగులేటి పేషీ వద్ద నేతల రద్దీ
రెండో విడత ఎంపికలో చిక్కుముడి
లబ్ధిదారుల ఆందోళనలు, రీ-సర్వేపై వ్యతిరేకత
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్దిదారుల ఆందోళన క్రమక్రమంగా పెరుగుతోంది. తమను అర్హులుగా గుర్తించినప్పటికీ మంజూరీ పత్రాలు ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు మొదటి విడత ఇండ్ల బిల్లుల కోసం, మరోవైపు రెండో విడత మంజూరీ కోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా ఇందిరమ్మ ఇండ్ల కోసం భారీగా డిమాండ్ కనిపిస్తోంది. రెండో విడతలో భాగంగా ప్రభుత్వం ‘ఊరికో ఆరు మాత్రమే‘ మంజూరు చేయడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
మొదటి విడత జాబితాల్లో పేర్లు రానివారందరికీ రెండో విడతలో ఖచ్చితంగా వస్తాయని స్థానిక నేతలు భరోసా ఇచ్చారు. తీరా అది నిరాశాజనకంగా ఉండడంతో ఇళ్ల మంజూరీపై అధికార పార్టీలో ముసలం మొదలైంది. ఏ గ్రామంలో చూసినా గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి అసంతృప్తి, విధానపరమైన నిర్ణయాలపై విముఖత స్పష్టంగా కనిపిస్తోంది. రెండో విడతలో మంజూరు చేస్తామన్న ఇండ్లు ఏమయ్యాయని అర్హులైన లబ్దిదారులు నాయకులను నిలదీస్తుండడంతో సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఇలాగైతే ప్రజల్లో ముఖం పెట్టుకుని తిరగలేమంటూ వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ, మండల కమిటీలు, నేతల ద్వారా స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు చేసేదేమీలేక సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేషీ వద్ద నిరీక్షణలకు పరిమితమవుతున్నారు. ప్రతినిత్యం ఆ మంత్రి కార్యాలయంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలు, మండల పార్టీకి చెందిన అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు.. ఇలా అన్ని స్థాయిల్లో నేతలు వచ్చి తమతమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచే పనిలో పడ్డారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా ఉంటే.. త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ఎలా తిరగాలన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజా పరిస్థితులు, క్షేత్రస్థాయి పరిణామాలను పరిశీలిస్తే, ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పేదలకు అందనంత ఎత్తులో కనిపిస్తున్నాయి.
ఏ గ్రామంలో చూసినా లబ్ధిదారుల వాదనలు వింత ధోరణితోనే ఉంటున్నాయి. మంజూరై నిర్మాణంలో ఉన్న లబ్ధిదారుల నుంచి ఒక రకమైన సమస్యలు, సవాళ్లతో కూడిన వాదనలు వినిపిస్తుంటే.. సొంతింటి కోసం కొండంత ఆశతో దరఖాస్తు చేసుకుని ఎప్పుడిస్తారోనన్న ఎదురుచూపులతో మరో కోణంలో ఆందోళనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తొలివిడతలో దాదాపు 80శాతం లబ్ధిదారులు రాజకీయ జోక్యం లేకుండానే ఎంపిక చేయబడినప్పటికీ.. వారి ఆర్థిక స్తోమత పునాది కూడా వేయలేని స్థాయిలో కనిపిస్తోంది.
చిన్న, పెద్ద కలుపుకుని గ్రామాలకు 10 నుంచి 20 ఇండ్లు, మండల కేంద్రాలకు గరిష్టంగా 50 ఇండ్లు మాత్రమే మంజూరు చేయడంలో రాజకీయ కోణంలో విమర్శలు అటుంచి వాస్తవ పరిస్థితుల మేరకు ఊరించి ఉసూరుమనించినట్లుగా స్పష్టమవుతోంది.
అందుకు తోడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇందిరా ఆవాస్ యోజన ద్వారా నిధులు సమకూర్చుకునే క్రమంలో మాట మార్చిన ప్రభుత్వం గతానికి భిన్నంగా నిబంధనలను కఠినతరం చేసి 60 గజముల విస్తీర్ణానికి మించి నిర్మించిన ఇండ్లకు బిల్లులు చెల్లించబోమన్న స్పష్టమైన సంకేతాలు పంపించింది.
ఒకవేళ కొలతలతో కూడిన నిర్మాణ దశల ఛాయా చిత్రాలు యాప్లో అప్లోడ్ చేయడం సాధ్యపడడం లేదు. ఈ వ్యవహారంపై లబ్ధిదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది.
‘ఇందిరమ్మ’ గృహ నిర్మాణ పథకంలో మొదటి దశ నిర్మాణం కొనసాగుతుండగానే రెండోదశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చిక్కుముడి సమస్యగా మారుతోంది. తాజాగా పూర్తయిన వడపోత ప్రక్రియపై గ్రామాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.
తొలి విడతలో 71,482 మందిని మాత్రమే ఎంపిక చేయడంతో సమస్య నానాటికీ జఠిలమవుతోంది. అసలే.. ప్రాదేశిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ఇటు అధికార యంత్రాంగానికి, అటు ప్రభుత్వ పెద్దలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంటోంది.
సర్కారు రీ-సర్వే ఆదేశాలపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. లబ్ధిదారుల సంఖ్య మూడోవంతుకు తగ్గడంతో పేద వర్గాలు ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఐదు హామీలు అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ… గ్రామాల్లో వారి పాచికలకు ఫలితం లేకుండా పోతోంది.
ఇప్పటికే కీలకమైన రైతుభందు, రైతురుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్ అందజేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో కీలకమైన ఇందిరమ్మ ఇళ్లు పంపిణీకి శ్రీకారం చుట్టే క్రమంలో ఎడతెగని సమస్య వచ్చిపడింది.
ప్రజాపాలన, గ్రామసభల ద్వారా సేకరించిన దరఖాస్తులను వడిపోసి లబ్ధిదారులను మూడు జాబితాలుగా విభజించారు. త్వరలోనే వీరందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నామని అధికారులు సెలవిస్తున్నారు.
