డిగ్రీ కాదు, దిశ ముఖ్యం.. నైపుణ్యాలే యువత భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి
డిగ్రీ కాదు, దిశ ముఖ్యం.. నైపుణ్యాలే యువత భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి
డిగ్రీల కంటే నైపుణ్యాలకు పెరుగుతున్న ప్రాధాన్యం
మారుతున్న విద్య.. మారుతున్న యువత ఆలోచనలు
జెన్ జెడ్ కెరీర్ ఎంపికల్లో కొత్త ధోరణి
విద్యా వ్యవస్థ–పరిశ్రమ అవసరాల మధ్య అంతరం
భారతదేశంలో ఉన్నత విద్య, ఉపాధి, యువత ఆశయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ… ఈ నాలుగు అంశాలు ఈరోజు ఒకే వేదికపై కలుసుకుంటున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు మంచి విద్య అంటే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ప్రవేశం, ఆ తర్వాత ఉన్నత డిగ్రీ, విదేశీ ఉద్యోగం అనే ఒక నిర్దిష్ట మార్గం ఉండేది. ఇప్పుడు ఆ మార్గం మారుతోంది. ప్రతిభకు కొత్త నిర్వచనం వస్తోంది. డిగ్రీల కంటే నైపుణ్యాలకు, కాలేజీ పేరుకంటే పనితీరుకు, సర్టిఫికెట్ల కంటే సృజనాత్మకతకు ప్రపంచం ఎక్కువ విలువ ఇస్తోంది. ఈ మార్పుకు భారత యువత, ముఖ్యంగా కొత్త తరం విద్యార్థులు కేంద్రబిందువుగా మారుతున్నారు.
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కొన్ని సంఘటనలు ఈ మార్పును స్పష్టంగా చూపించాయి. ఒక యువకుడి నిర్ణయం యువత మనసుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. ఐఐటీ ఢిల్లీలో బీటెక్ చదువుతున్న 19 ఏళ్ల ఆశీష్ కుమార్ వర్మ డిగ్రీని మధ్యలో వదిలేసి మైక్రోసాఫ్ట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాడు. 19 ఏళ్ల వయసులోనే ప్రపంచంలోనే అతి చిన్న గూగుల్ డెవలపర్ ఎక్స్‌పర్ట్‌గా గుర్తింపు పొందిన ఆశీష్, జపాన్ సకురా సైన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీకి తన యాప్‌ను కూడా ప్రదర్శించాడు. లింక్డ్‌ఇన్‌లో ఆయన రాసిన పోస్ట్ వైరల్ అయి దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఆశీష్ తన పోస్ట్‌లో ఇలా అన్నాడు: ”కొందరు విద్యార్థులు కాలేజీలో వివిధ విషయాలు అన్వేషించాలని వస్తారు. వారికి ఐఐటీలు బాగా సరిపోతాయి. కానీ నాకు లాంటి వారికి క్లియర్ గోల్ ఉంటుంది. వారు త్వరగా పని మొదలు పెట్టాలని చూస్తారు.” ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు జెన్ జెడ్ యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే, ఈ ఒక్క సంఘటనను కేవలం ఒక విద్యార్థి వ్యక్తిగత నిర్ణయంగా చూడలేం. ఇది భారత ఉన్నత విద్యా వ్యవస్థ ముందుంచిన ఒక కీలక ప్రశ్న. నాలుగేళ్ల డిగ్రీ పూర్తయ్యేలోపే ఒక విద్యార్థి ప్రపంచ స్థాయి కంపెనీకి అవసరమైన నైపుణ్యాలు సంపాదిస్తే… సమస్య విద్యార్థిలో ఉందా? లేక విద్యా వ్యవస్థలో ఉందా? నేటి ఉద్యోగ ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను కళాశాలలే అందిస్తున్నాయా? లేక విద్యార్థులు వాటిని సొంతంగా నేర్చుకుని తమ దారిని తామే నిర్మించుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకకపోతే, ఉన్నత విద్య భవిష్యత్తుపై జరుగుతున్న చర్చ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది.
గతం నుంచి ప్రస్తుతం వరకు ట్రెండ్ ఎలా మారింది?
గత 30 ఏళ్లుగా ఐఐటీ గ్రాడ్యుయేట్లు అమెరికా, ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారు. 1964 నుంచి 2001 వరకు 35 శాతం మంది విదేశాలకు వెళ్లారు. కానీ 2002 తర్వాత ఈ శాతం 16 శాతానికి తగ్గింది. ఇప్పుడు ఇండియాలోనే మంచి అవకాశాలు ఉన్నాయని యువత భావిస్తోంది. ఐఐటీ బాంబే 2023-24 ప్లేస్‌మెంట్లలో 1475 ఆఫర్లలో కేవలం 78 మాత్రమే విదేశీ కంపెనీల నుంచి వచ్చాయి. ముఖ్యంగా 2020 తరువాత భారత ఉన్నత విద్యలో ఒక ఆసక్తికరమైన ధోరణి స్పష్టమైంది. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు కూడా డిగ్రీ పూర్తి చేయకుండా లేదా మధ్యలోనే విరమించి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ సంస్థల్లో ఉద్యోగాలు తీసుకుంటున్నారు. ఈ ఘటనలు ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారాయి. దీన్ని కొందరు **”రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్”**గా అభివర్ణిస్తున్నారు.
జెన్ జెడ్ ఎందుకు ఇలా మారుతోంది?
- ప్రాక్టికల్ నాలెడ్జ్: కేవలం థియరీ చదవడం కంటే రియల్ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు ఎక్కువగా ఇష్టం.
- ఫాస్ట్ గ్రోత్: స్టార్టప్‌లు, ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ల ద్వారా త్వరగా కెరీర్ నిర్మించుకోవచ్చు.
- ఇండియా ఆపర్చ్యూనిటీలు: దేశ ఆర్థిక వృద్ధి, డిజిటల్ ఇండియా వల్ల అవకాశాలు పెరిగాయి.
- వీసా సమస్యలు: అమెరికాలో హెచ్1-బి వీసా పరిమితులు, లేఅఫ్‌లు కూడా ప్రభావం చూపుతున్నాయి.
ఈ తరం ఆలోచనల్లో వచ్చిన ఈ మార్పు విద్యా వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రతి సంవత్సరం భారతదేశంలో లక్షలాది మంది పట్టభద్రులు బయటకు వస్తున్నారు. కానీ వారిలో అందరికీ తగిన ఉద్యోగాలు లభించడం లేదు. అనేక అధ్యయనాలు విద్య పూర్తిచేసిన వారిలో గణనీయమైన శాతం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగి లేరని సూచిస్తున్నాయి. ఇది యువత ప్రతిభ లోపం కాదు. విద్యా వ్యవస్థ, పరిశ్రమ అవసరాల మధ్య ఏర్పడిన అంతరం ప్రధాన కారణం. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలు ఉద్యోగ ప్రదేశంలో ఎదురయ్యే సమస్యలకు సరిపోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది.
ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఈ అంతరం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అనేక కళాశాలల్లో ఇప్పటికీ పాత పాఠ్యాంశాలే కొనసాగుతున్నాయి. విద్యార్థులకు నిజ జీవిత సమస్యలపై పనిచేసే అవకాశాలు తక్కువగా లభిస్తున్నాయి. దీంతో పట్టా చేతిలో ఉన్నప్పటికీ ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతోంది. మరోవైపు సంస్థలు సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కోసం వెతుకుతున్నాయి. ఈ విరుద్ధ పరిస్థితి భారత ఉన్నత విద్య ఎదుర్కొంటున్న ప్రధాన సవాల్.
ఇక్కడ మరో అంశాన్ని కూడా విస్మరించరాదు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే ఏర్పడలేదు. అవి పరిశోధనలకు, కొత్త ఆవిష్కరణలకు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను తయారు చేయడానికి ఏర్పడ్డాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో మధ్యలోనే చదువు విడిచి ఉద్యోగాలకు వెళ్లడం కొనసాగితే దీర్ఘకాలంలో పరిశోధన రంగంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
అయితే ఇక్కడ ఒక మౌలిక ప్రశ్న ఎదురవుతోంది. ఉద్యోగాలు కల్పించే విశ్వవిద్యాలయాలు కావాలా? లేక జ్ఞానాన్ని సృష్టించే విశ్వవిద్యాలయాలు కావాలా? ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఈ రెండింటినీ సమన్వయం చేస్తున్నాయి. భారత ఉన్నత విద్య ముందున్న అతిపెద్ద సవాలు కూడా ఇదే — ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అందిస్తూనే, జ్ఞాన సృష్టికి కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దడం.
ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి
లైవ్ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చేయాలి. ఏఐ, డేటా సైన్స్, సస్టైనబుల్ టెక్నాలజీలపై దృష్టి పెట్టాలి. యువతకు లోన్స్, మెంటారింగ్, ఇన్‌క్యుబేటర్లు పెంచాలి. రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ పథకాలను విస్తరించి, రీసెర్చ్ ఫండింగ్ పెంచాలి. పెద్ద కంపెనీలు విద్యా సంస్థలతో భాగస్వామ్యం పెంచి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఇవ్వాలి. యువత నైపుణ్యాలు నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలి. డిగ్రీ మాత్రమే కాకుండా స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి.
భవిష్యత్తు దిశ
2030 నాటికి ప్రపంచంలోనే అత్యంత పెద్ద పని వయసు జనాభా భారతదేశంలో ఉండబోతోంది. ఈ జనాభా సరైన నైపుణ్యాలతో ఉంటే, భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా మారే అవకాశం ఉంది. భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత పెద్ద యువశక్తి ఉంది. ఈ యువశక్తిని పరీక్షల్లో మార్కులు సాధించే యంత్రాలుగా కాకుండా, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు చూపగల, సృజనాత్మక మేధావులుగా తీర్చిదిద్దడం కాలం విధించిన బాధ్యత. ఐఐటీలో చేరి ఉద్యోగం ఎంచుకున్న ఒక యువకుడి నిర్ణయం కేవలం వ్యక్తిగత ఎంపిక కాదు; అది భారత ఉన్నత విద్యా వ్యవస్థ ముందుంచిన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం డిగ్రీని తిరస్కరించడం కాదు, డిగ్రీకి నైపుణ్యాన్ని జోడించడం. ప్రపంచం ఇప్పుడు డిగ్రీలను కాదు… సమస్యలకు పరిష్కారాలను వెతికే మేధస్సును కోరుతోంది.
– ప్రవళిక
