rain |కాసేప‌ట్లో వర్షం

కాసేప‌ట్లో వర్షం

హైదరాబాద్‌లో గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

రాబోయే రెండు గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో వర్షం
తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ మోస్తరు జల్లులు..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

ఆంధ్ర్రప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. రాబోయే రెండు గంటల్లో హైదరాబాద్ నగరంలోని పశ్చిమ, దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులతో పాటు అక్కడక్కడా స్వల్పకాలిక వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాల వ్యవధి తక్కువగా ఉన్నప్పటికీ గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిల్చోకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

అలాగే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలుచోట్ల జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.