ధరణి అక్రమాల నేపథ్యంలో కొత్త పోర్టల్‌పై ప్రభుత్వ యోచన
ధరణి అక్రమాల నేపథ్యంలో కొత్త పోర్టల్‌పై ప్రభుత్వ యోచన
ధరణి స్థానంలో భూభారతి.. మళ్లీ మార్పులపై చర్చ
ఫోరెన్సిక్ ఆడిట్లో వెలుగుచూసిన అక్రమాలు
ప్రభుత్వ భూములు, మ్యుటేషన్లలో భారీ అవకతవకలు
రుసుముల చెల్లింపులు, భూ రికార్డుల్లో లొసుగులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో రూపొందించిన భూభారతిని మళ్లీ మార్చాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతో శ్రమకోర్చి రూపొందించిన భూభారతిలోనూ అక్రమాలకు అవకాశం కల్పించే ధరణి సాఫ్ట్వేర్నునే వినియోగిస్తున్నందున పోర్టల్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని గుర్తించినట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చినట్లుగా తమకూ ఇది శాపంగా మారకముందే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి విరుగుడుగా, అధునాతనంగా మరో పోర్టల్ రూపొందించాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే ధరణి అక్రమాలపై ఏర్పాటైన కమిటీ త్వరలో సమావేశం కానుంది. రెండు రోజుల్లో రానున్న ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక కూడా ఈ కమిటీకి అప్పగించి అధ్యయనం చేయించనున్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు 15 రోజుల గడువు నిర్దేశించారు. కమిటీ ఇచ్చే నివేదిక మరో సంచలనానికి దారి తీయనుంది. ధరణి అక్రమాలు ఏమేరకు ఉన్నాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఎవరి మెడకు ఈ అంశం చుట్టుకుంటుందోననే చర్చ ఊపందుకుంది.
భూభారతి డేటా, కోడింగ్ పూర్తిగా ధరణిదే వినియోగిస్తుండటంతో భూభారతిలోనూ కొన్ని అక్రమాలు జరిగినట్టు భావిస్తున్నారు. అందువల్ల భూభారతిని కూడా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం టెర్రాసిస్ ఎక్కడ అక్రమాలు చేసిందనే దానిపై సైబర్ సెక్యూరిటీ బృందంతో కలిసి ఉన్నతాధికారుల కమిటీ లోతుగా విచారణ నిర్వహిస్తోంది.
ధరణి అక్రమాల్లో కొందరు అధికారుల ప్రమేయం
ధరణి పోర్టల్‌లో అనధికారిక లాగిన్ ద్వారా జరిగిన అక్రమాలకు కారణమైన వారి గుర్తింపు జరుగుతోందని తెలిసింది. ఫోరెన్సిక్ నివేదికలో ఆయా వివరాలు ఉండగా, ప్రధానంగా ఇందులో కొందరు అధికారులు, రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం. టీఎస్ఎఎస్కు చెందిన వెంకటేశ్వరరావుకు బాధ్యతల అప్పగింతపై ప్రభుత్వం అనేక అనుమానాలు వ్యక్తం చేసింది.
ధరణి పోర్టల్‌లో 304 అక్రమ ఎంట్రీలు ఉన్నట్టు, ఎలాంటి క్షేత్రస్థాయి నివేదికలు, అధికారుల లాగిన్లు లేకుండానే డిజిటల్ రికార్డులను ట్యాంపర్ చేసినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో గుర్తించారు. ఒక్కో అక్రమ ఎంట్రీలో డబుల్ డిజిట్ ఎకరాలు మార్చేసినట్టు కనుగొన్నారు. ఇలా వేల ఎకరాలు ప్రభావితమైనట్టు ప్రాథమిక అంచనా. వీటి విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
రికార్డులను మార్చి సంబంధంలేని వ్యక్తుల పేర్లపైకి యాజమాన్య హక్కులు మార్చేశారు. ముఖ్యంగా అత్యంత విలువైన ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పోడు భూములు ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వ్యవహరించినట్టు తేలింది. నాలా కన్వర్షన్, భూముల మ్యుటేషన్ ప్రక్రియలో చట్టబద్ధమైన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు.
ఎవరి ఆమోదం లేకుండానే వివాదాస్పద ప్రభుత్వ భూములకు ఫైనల్ అప్రూవల్స్ ఇచ్చినట్టు విచారణలో తేలింది. భూ వివాదాలకు సంబంధించి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 54 కీలక కేసుల ఫైళ్లలో కూడా తీవ్రమైన లొసుగులు బయటపడ్డాయి. డిజిటల్ సైన్ లేకుండానే ఫైళ్లు సిస్టమ్‌లో చలామణి కావడం వెనుక నిధుల దుర్వినియోగం, రికార్డుల మార్పిడి జరిగి ఉండవచ్చని ఆడిట్ బృందం అనుమానం వ్యక్తం చేసింది.
ఈ అక్రమాలు ప్రధానంగా మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినవిగా గుర్తించారు. వీటిలో వందల ఎకరాలు మారినట్టు తేల్చారు. వాటి విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
రుసుముల చెల్లింపుల్లోనూ లొసుగులు
ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివిధ రకాల ఫీజుల ప్రక్రియలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. రిజిస్ట్రేషన్ల కోసం కేటాయించిన స్లాట్ బుకింగ్ సిస్టమ్‌లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పూర్తి ఫీజులు చెల్లించకుండా లేదా తక్కువ ఫీజులు చూపించి నిబంధనలకు విరుద్ధంగా స్లాట్లు బుక్ చేసుకున్నట్టు, సంబంధిత ల్యాండ్ అప్లికేషన్లను ఆమోదించినట్టు ఆడిట్లో వెల్లడైంది.
భూ విస్తీర్ణంలో భారీగా తేడాలు
2017లో జరిగిన ల్యాండ్ రికార్డుల నవీకరణలో 1.48 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు నమోదయ్యాయి. అన్ని రకాల ప్రభుత్వ భూములు 77.38 లక్షల ఎకరాలు ఉండగా, ధరణి పోర్టల్ ప్రకారం వ్యవసాయ అసైన్డ్ భూములు 1.53 కోట్ల ఎకరాలు ఉన్నట్లు నమోదైంది. ప్రభుత్వ భూములు 75.96 లక్షల ఎకరాలు ఉన్నట్లు చూపించారు.
ఈ ప్రక్రియలో లక్షల ఎకరాలు తారుమారయ్యాయి. పట్టా భూములు నిషేధిత జాబితాలోకి, ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారాయి. అదే సమయంలో భూ విస్తీర్ణంలో భారీ తేడాలు నమోదయ్యాయి.
ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు బాధ్యతలను ఐటీ శాఖ పరిధిలోని ఈ-గవర్నెన్స్, టీజీటీఎస్ స్పెషల్ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది.
