రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..
- కస్టడీ కోరుతూ ఈడీ రంగంలోకి!
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం (AP Liquor Transport Scam) కేసులో నాంపల్లిలోని ఈడీ ప్రత్యేక కోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ద్వారా అరెస్టయి రిమాండ్‌లో ఉన్న ప్రధాన సూత్రధారి, గత ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి (కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి) దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 13వ తేదీకి వాయిదా పడింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.
నిందితుల కస్టడీ కోసం ఈడీ పిటిషన్
మరోవైపు, ఈ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ (అక్రమ ద్రవ్య చలామణి), హవాలా లావాదేవీలపై విచారణను ఈడీ అధికారులు మరింత ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌లో దాదాపు రూ. 195.33 కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారనే ఆరోపణలపై లోతైన ఆధారాలు సేకరించేందుకు ఈడీ కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఏ2 నిందితుడిగా ఉన్న ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డితో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌లను వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు.
రూ. 195 కోట్ల కుంభకోణం.. నిధుల మళ్లింపుపై ఆరా
లిక్కర్ డిపోల నుంచి రిటైల్ దుకాణాలకు మద్యం రవాణా చేసే టెండర్ల రేట్లను కృత్రిమంగా పెంచి, ఒక సిండికేట్‌గా ఏర్పడి భారీగా నిధులు మళ్లించినట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. నకిలీ కంపెనీలు (Shell Companies) సృష్టించి హవాలా మార్గాల ద్వారా లంచాలు చేతులు మారాయనే అంశంపై నిందితులను ముఖాముఖి కూర్చోబెట్టి విచారించాల్సిన అవసరం ఉందని ఈడీ స్పష్టం చేసింది. అయితే ఈ కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
