ట్రంప్‌ వ్యాఖ్యల్లో బయటపడిన దురహంకారం.. ఖమేనీ అంత్యక్రియలపై వివాదం

ట్రంప్‌ వ్యాఖ్యల్లో బయటపడిన దురహంకారం.. ఖమేనీ అంత్యక్రియలపై వివాదం

ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్‌ వ్యాఖ్యల వివాదం

ఇరాన్‌ ప్రజల భావోద్వేగాలను అవమానించిన తీరు

అమెరికా శక్తి.. ప్రపంచ అంగీకారంపై ప్రశ్నలు

ఇరాన్‌ మాజీ సర్వోన్నత నాయకుడు ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలను వీక్షించడానికి చేరుకున్న లక్షలాది మందితో ఇసుకవేస్తే రాలనంతగా టెహరాన్‌ కిక్కిరిసిపోయింది. ప్రసార మాధ్యమాల్లో లక్షలాది మంది కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు చూసి సామాన్యులు ఆశ్చర్య పోతుంటే, అగ్రరాజ్యాధినేత ట్రంప్‌కి ఇదంతా మొసలి కన్నీరుగా కనిపించడం ఆయనలోని అహంకారానికి నిదర్శనం. ఖమేనీ ఇరాన్‌కి తిరుగులేని నాయకునిగా 28 సంవత్సరాలు పైగా అధికారంలో కొనసాగిన దృష్ట్యా అక్కడి ప్రజలు ఆయనను అంతగా ఆరాధించడం సహజమే. అది మొసలి కన్నీరు ఎలా అవుతుంది. ఇరాన్‌ సంప్రదాయాల ప్రకారం ఆయన అంత్యక్రియలను అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తోంది. దానిని తప్పుపట్టడానికి లేదా దానిపై ఎగతాళిగా మాట్లాడటానికి మనం ఎవరం? ట్రంప్‌ మాటలు, ధోరణి ఆయనలో అహంకారం తలకెక్కిన తీరును బహిర్గతం చేస్తున్నాయి. ఖమేనీ ఇరాన్‌పై అమెరికా దాడి ప్రారంభించిన రోజైన ఫిబ్రవరి 28వ తేదీన మరణించారు. ఆయన భౌతికకాయాన్ని దేశ ప్రజలంతా వీక్షించేందుకు ఇంతకాలం భద్రపర్చారు. దీనిపై వ్యాఖ్యలు చేయడం అగ్రరాజ్యాధినేతకు తగదు.

ఈ అంత్యక్రియలకు హాజరైన భారత ప్రతినిధులకు ఇరాన్‌ మీ స్నేహాన్ని ఎన్నటికీ మరువమంటూ ఎంతో వినమ్రాన్ని ప్రదర్శించింది. ట్రంప్‌ మాత్రం తాము అనుకుంటే ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన వారందరినీ ఒక దెబ్బతో హతమార్చి ఉండేవాళ్ళమంటూ ప్రకటించి తన దురహంకారాన్ని చాటుకున్నారు. అమెరికాకు ఆయుధ శక్తి ఉన్న మాట నిజమే, కానీ, ప్రపంచాన్ని ఒప్పించే శక్తి లేదు. ఇరాన్‌పై ట్రంప్‌కి పీకల వరకూ ద్వేషం ఉండి ఉండవచ్చు. కానీ, దానిని కక్కడానికి ఇది సమయం కాదు. తమ నాయకుడు అమెరికా జరిపిన బాంబుదాడిలో అర్థంతరంగా కన్నుమూశాడని ఇరాన్‌ ప్రజలు రోదిస్తున్న సమయంలో ట్రంప్‌ ఆ తీరున మాట్లాడి ఉండవల్సింది కాదు. ఇరాన్‌లో మిగిలిన నాయకత్వాన్ని కూడా నిర్మూలించి ఉండేవాడిననీ, అయితే, తమతో చర్చలు జరపడానికి ఎవరూ మిగలరన్న కారణాన వదిలి వేశామంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించిన తీరు ఆయనలోని నియంతృత్వ పోకడను బహిర్గతం చేస్తోంది. తమది గొప్ప ప్రజాస్వామిక దేశమని గొప్పలు చెప్పుకుంటున్న అమెరికా అగ్రనేత ఈ మాదిరి వ్యాఖ్యానించడం అమెరికా ప్రతిష్టను దిగజార్చడమే. ఇరానియన్లు ఖమేనీని ద్వేషిస్తున్నారని ఇంతకాలం తాను అనుకున్నానని ట్రంప్‌ మరో మాట అన్నారు. ఖమేనీని ద్వేషిస్తున్న కారణంగా ఆయన అంత్యక్రియలకు ఇంతమంది వచ్చి ఉండకపోవచ్చునని కూడా ఆయన అనుకున్నారట. ఒక దేశం, సంస్కృతి, నాగరికతపై అగ్రరాజ్యాధినేత అవగాహన ఎంత దిగజారుడుగా ఉందో ఆయన వ్యాఖ్యలే నిదర్శనం. ఇరాన్‌పైనా, ఖమేనీపైనా ట్రంప్‌ అంచనాలు తప్పని రుజువైనందుకు అవమాన భారంతో ఆయన ఉడికిపోతున్నారు.

ఇరాన్‌ అణ్వస్త్రాలను రహస్యంగా తయారు చేస్తోందన్న కారణం చూపి ఆ దేశంపై అమెరికా బాంబుదాడులు జరిపింది. అలాంటి అణ్వస్త్రాలు ప్రపంచంలో ఇతర దేశాలు కూడా తయారు చేస్తున్నాయి. అమెరికా వెనకేసుకొస్తున్న ఇజ్రాయెల్‌ జరుపుతున్న బాంబుదాడులకు ట్రంప్‌ చెప్పే సమాధానం ఏమిటి? అణ్వస్త్ర నిర్మూలనకు కృషి చేస్తున్నామని చెప్తూ ఈ మాదిరిగా బాంబుదాడులకు దిగడం అమెరికా ద్వంద్వ విధానాలకు నిదర్శనం.