Mobile Tariff Hike | మరోసారి పెరగనున్న టారిఫ్‌లు?

Mobile Tariff Hike | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశంలోని మొబైల్ వినియోగదారులకు మరోసారి టారిఫ్ భారం పడే అవకాశం కనిపిస్తోంది. మరో మూడు నుంచి నాలుగు నెలల్లో మొబైల్ టారిఫ్‌లను 12 శాతం నుంచి 15 శాతం వరకు పెంచే అవకాశం ఉందని ప్రముఖ మార్కెట్ విశ్లేషణ సంస్థ (Centrum Institutional Research) తన తాజా నివేదికలో పేర్కొంది.

నివేదిక ప్రకారం.. దేశంలో 4జీ, 5జీ సేవల వినియోగం వేగంగా పెరుగుతుండటంతో డేటా వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. పెరుగుతున్న నెట్‌వర్క్ పెట్టుబడులు, నిర్వహణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని టెలికాం సంస్థలు మరోసారి టారిఫ్‌లను సవరించే అవకాశముందని విశ్లేషించింది.

అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో టెలికాం కంపెనీల ఏఆర్‌పీయూ (Average Revenue Per User) 1 నుంచి 1.5 శాతం వరకు పెరిగే అవకాశముందని నివేదిక అంచనా వేసింది. టారిఫ్‌ల పెంపు అమల్లోకి వస్తే, నెలవారీ మొబైల్ రీచార్జ్‌లు, డేటా ప్లాన్‌లపై వినియోగదారులు మరింత ఖర్చు చేయాల్సి రావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.