నీటి ఎక్స్‌పైరీ డేట్ ఎంతో తెలుసా?

  • మన ఆలోచనల్లోనే అసలు చిక్కు!

ఆంధ్రప్రభ, చౌటుప్పల్ : ​ఒక రోజు పాత నీటిని కొందరు పారబోస్తారు… ఒక వారం పాత నీటిని మరికొందరు దాచుకుని తాగుతారు… కానీ వేల సంవత్సరాల క్రితం భూమిలో నిల్వైన నీటిని మాత్రం మనం అత్యంత స్వచ్ఛమైనదిగా భావిస్తాం! అసలు నీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉందా? ఈ ప్రశ్న వెనుక ఉన్న అసలు నిజాలు తెలిస్తే నీటిపై మీ ఆలోచనే మారిపోతుంది. ​చాలాసార్లు మనం మన సౌకర్యాన్ని బట్టి, మన లభ్యతను బట్టి నీటికి ఒక “ఎక్స్‌పైరీ డేట్” నిర్ణయించేస్తుంటాం. కానీ నిజానికి దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారమూ లేదు. ఒకసారి మన చుట్టూ జరుగుతున్న ఈ విచిత్రమైన పరిస్థితులను గమనిస్తే ఇది స్పష్టమవుతుంది.

​మన అవసరం… నీటి కాలపరిమితి !

నగరాల్లో (ఒక రోజు) : ఎక్కడైతే ప్రతిరోజూ మున్సిపల్ పంపుల్లో నీళ్లు వస్తాయో, అక్కడ నిన్నటి నీటిని “పాసిపోయాయి” అనుకుంటూ పారబోసేస్తారు. వీరి లెక్కలో నీటి ఎక్స్‌పైరీ డేట్ కేవలం 24 గంటలే, గ్రామాల్లో, నీటి ఎద్దడి ప్రాంతాల్లో (వారానికి పైగా): అదే నీరు రెండు నుండి ఎనిమిది రోజుల పాటు అచ్చం ఫ్రెష్‌గా, తాగడానికి వీలుగానే ఉంటుంది. ఎవరూ పారబోయరు. ​శుభకార్యాల్లో (కొన్ని నిమిషాలు): టేబుల్ మీద కొత్త వాటర్ బాటిల్ ఓపెన్ చేయగానే, పక్కనే ఉన్న పాత బాటిల్‌ను పనికిరానిదిగా చూస్తూ అక్కడే వదిలేస్తారు. ఇక్కడ ఎక్స్‌పైరీ డేట్ కొన్ని నిమిషాలు మాత్రమే.

​ప్రకృతిలో నీటి ప్రయాణం వేరు..

​ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు, తదుపరి నీటి వనరు దొరికే వరకు ప్రతి ఒక్క నీటి చుక్కా ఎంతో విలువైనదిగా, ఫ్రెష్‌గానే ఉంటుంది. ​డ్యామ్‌లు, చెరువుల్లో, ప్రకృతిలో నిల్వ ఉండే నీరు తదుపరి వర్షాకాలం వచ్చే వరకు, కొన్నిసార్లు కరవు కాలంలో 2-3 ఏళ్ల వరకు కూడా వాడుకలోనే ఉంటుంది.

​భూగర్భ జలాలు : మనం బోరు బావుల్లో 50 నుండి 500 అడుగుల లోతు నుండి తోడే నీరు వందల, వేల సంవత్సరాల నాటిది. అయినా సరే, అదే నీటిని మనం అత్యంత సురక్షితమైనదిగా, ఖనిజ లవణాలు ఉన్న ఆరోగ్యకరమైన నీరుగా భావిస్తాం.

​నిజం ఏమిటంటే..

నీటికి ఎటువంటి ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. దాని కాలపరిమితిని నిర్ణయించేది కేవలం మన ఆలోచన, అది మనకు దొరికే లభ్యత, దాని పరిశుభ్రత మాత్రమే. నీరు సులభంగా దొరికినప్పుడు దాన్ని ‘పాసిపోయింది’ అని నిర్లక్ష్యం చేస్తాం; అదే కరవు వచ్చినప్పుడు ఆ నీరే అమృతంతో సమానమైపోతుంది.

​మన అజాగ్రత్తే శాపం !

​ప్లాస్టిక్ బాటిళ్లపై ఉండే ఎక్స్‌పైరీ డేట్ లోపల ఉన్న నీటిది కాదు, ఆ ప్లాస్టిక్ బాటిల్ కాలపరిమితిది మాత్రమే. నీటిని నిల్వ ఉంచే పాత్రలు శుభ్రంగా ఉంటే నీరు ఎప్పటికీ పాడవదు. ప్రకృతిలో నీరు అయిపోవడానికి ముందే, మన అజాగ్రత్త మనల్ని దాహంతో అలమటించేలా చేసే ప్రమాదముంది. కాబట్టి, నీటి విలువను గుర్తిద్దాం.. ప్రతి చుక్కనూ పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్ తరాలకు జీవనాధారాన్ని అందిద్దాం!