Balapur | స్థానికుల్లో భయాందోళన…

Balapur | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫహద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలను సేకరించారు.

హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత విభేదాలు, పాత కక్షలు లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన కీలక ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నామని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.