గిరిజన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత

గిరిజన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత
ఉట్నూర్, ఆంధ్రప్రభ : గిరిజన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరంద అన్నారు. ఆయన బుధవారంకేంద్రంలో ప్రభుత్వం చేపడుతున్న “జన్ భాగిదారి అభియాన్ – సబ్సే దూర్ సబ్సే పహలే” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి మంద మకరంద్ కార్యాలయం ప్రాంగణంలోని హరితవనంలో ఇప్ప మొక్కను నాటారు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి మంద మకరంద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజనుల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదల, విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. “జన్ భాగిదారి అభియాన్ – సబ్సే దూర్ సబ్సే పహలే” కార్యక్రమం ద్వారా దూర ప్రాంత గిరిజనులకు ప్రభుత్వ పథకాలను చేరవేసే లక్ష్యంతో విస్తృత అవగాహన కార్యక్రమాలునిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెట్ల పెంపకం ద్వారా ప్రకృతి సమతౌల్యం కాపాడబడుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఇప్ప చెట్టు గిరిజన సంస్కృతితో ముడిపడి ఉండటమే కాకుండా ఔషధ, ఆర్థిక పరమైన ప్రాధాన్యత కూడ కలిగి ఉందని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ జాదవ్, ఏపీఓ వసంతరావు జాదవ్, ఉట్నూర్ జిసిసి డిఎం గుడిమల్ల సందీప్ కుమార్, అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ ప్రతినిధులు, టి ఎస్ పి ఆర్ టి యు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఆడే ప్రకాష్, ఉట్నూర్ మాజీ సర్పంచ్ బొంత ఆశరెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు, యువత గిరిజనులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం హరితవనం అభివృద్ధికి అవసరమైన చర్యలపై అధికారులు చర్చించారు.
