రూ.1కే పత్తి విత్తనాలు..

దండేపల్లి, ఆంధ్రప్రభ: దండేపల్లి మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ పథకం-2026–27 కింద ఎంపిక చేసిన రైతులకు రాయితీపై పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు మండలంలో 97 హెక్టార్ల (242.5 ఎకరాలు) విస్తీర్ణంలో ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి అంజిత్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక సాంద్రత పత్తి సాగును 142.5 ఎకరాల్లో చేపట్టేందుకు ఎకరానికి ఆరు విత్తన ప్యాకెట్ల చొప్పున పంపిణీ చేశామన్నారు. క్లోజర్ స్పేసింగ్ విధానాన్ని 57.5 ఎకరాల్లో ప్రోత్సహిస్తూ వరుసలు, మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి సాగు చేసే రైతులకు ఎకరానికి నాలుగు ప్యాకెట్ల చొప్పున విత్తనాలు అందజేశామని తెలిపారు. మరో 42.5 ఎకరాల్లో అమలు చేస్తున్న పద్ధతిలో కూడా ఎకరానికి నాలుగు ప్యాకెట్ల చొప్పున పంపిణీ చేసినట్లు చెప్పారు.

రైతులకు ప్రోత్సాహకంగా ప్రతి విత్తన ప్యాకెట్‌ను కేవలం రూ.1 నామమాత్రపు ధరకే అందించడం విశేషమని అంజిత్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) మౌనిక, శ్రీకన్య, సాయి నరేష్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.