ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఘనత

ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ఘనత

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ:
ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ కార్పొరేట్ స్థాయికి దీటుగా నాణ్యమైన విద్య అందుతుందని తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని యనమల యశస్విని మరోసారి నిరూపించింది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో హెచ్ఈసీ (HEC) విభాగంలో యశస్విని 1000 మార్కులకు గాను 905 మార్కులు సాధించి జిల్లాలోనే టాపర్‌గా నిలిచింది. తొర్రూరు మండలంలోని పోలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న యనమల యాకన్న కుమార్తె అయిన యశస్విని.. తన కృషి, పట్టుదలతో చదివి ఈ ఉత్తమ ప్రతిభ కనబరిచింది.

ప్రజాపాలన ప్రగతి నివేదికల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఈ ప్రతిభావంతురాలైన విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో నైపుణ్య వంతమైన అధ్యాపకులు, కార్పొరేట్ స్థాయి వసతులు అందుతున్నాయని, విద్యార్థులు క్రమశిక్షణతో లక్ష్యసాధన వైపు అడుగులు వేస్తే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ.. యశస్విని సాధించిన విజయం ప్రభుత్వ కళాశాలల్లోని మిగతా విద్యార్థులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా ఈ ఫలితాలు ఉన్నాయని, ప్రభుత్వ విద్యా వ్యవస్థలోని ఉత్తమ బోధనకు ఈ విజయమే ప్రత్యక్ష తార్కాణమని హర్షం వ్యక్తం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు మరియు యశస్విని తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply