క్వార్టర్ ఫైనల్స్‌కు నిజామాబాద్
క్వార్టర్ ఫైనల్స్‌కు నిజామాబాద్
లీగ్ దశలో ఆరు మ్యాచ్లకు ఆరు విజయాలు
పాయింట్ పట్టికలో అగ్రస్థానం
నిజామాబాద్ స్పోర్ట్స్, జూన్ 3 (ఆంధ్రప్రభ): హెచ్‌సీఏ బి-డివిజన్ టీ-20 లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్ 2026-27లో నిజామాబాద్ జిల్లా జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. బుధవారం ఏకలవ్య-2 మైదానంలో జరిగిన ఆరో మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లూస్ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ బ్లూస్ జట్టు 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. నిజామాబాద్ బౌలర్లలో చిన్నుగారి రిత్విక్ 3 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. రయ్యాన్ బిన్ అబ్దుల్లా 2 వికెట్లు, విక్రమ్ నాయక్ గుగులోత్ 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి బాటలు వేశారు. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నిజామాబాద్ జిల్లా జట్టు కేవలం 13.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. విక్రాంత్ రెడ్డి ఎం 29 బంతుల్లో 49 పరుగులు చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. శ్రీకర్ రెడ్డి యెడ్లా 27 పరుగులతో అజేయంగా నిలిచాడు. దామా అజిత్ రాజా 11 పరుగులు చేయగా, విక్రమ్ నాయక్ గుగులోత్ 7 పరుగులు సాధించాడు.
ఈ మ్యాచ్‌లో విక్రాంత్ రెడ్డి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ 2 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి తన ఆల్‌రౌండ్ ప్రతిభను చాటుకున్నాడు. చిన్నుగారి రిత్విక్ అత్యుత్తమ బౌలర్‌గా నిలవగా, రయ్యాన్ బిన్ అబ్దుల్లా, విక్రమ్ నాయక్ గుగులోత్‌లు కీలక వికెట్లు సాధించారు.
ఈ విజయంతో గ్రూప్-ఏలో ఆడిన అన్ని 6 మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన నిజామాబాద్ జిల్లా జట్టు అజేయంగా నిలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందనీ జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి వెంకట్ రెడ్డి కోశాధికారి శ్రీనివాసరావు సంయుక్త కార్యదర్శి కోచ్ సురేష్ బాబులు తెలిపారు. అలాగే క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించి టైటిల్ వేటలో తన సత్తాను చాటుతోందనీ ఆకాంక్షించారు.
జట్టు ఆటగాళ్లు, కోచ్‌లు, జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ క్వార్టర్ ఫైనల్స్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలని ఆకాంక్షించారు.
