మొక్కజొన్న రైతుల కోసం గోదాం మంజూరు

మొక్కజొన్న రైతుల కోసం గోదాం మంజూరు
రైతులను ఆదుకున్న ప్రభుత్వం : పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్‌రావు
తొర్రూరు, ఆంధ్రప్రభ: తొర్రూరు మండలంలోని మొక్కజొన్న రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే గోదాం మంజూరు చేసి రైతులను ఆదుకుందని పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్‌రావు తెలిపారు.
గురువారం తొర్రూరు పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని సోమారం, తొర్రూరు కొనుగోలు కేంద్రాల్లో భారీగా మొక్కజొన్న నిల్వలు ఉండటంతో లారీలు అందుబాటులో లేకపోవడం, నిల్వ చేసేందుకు గోదాములు లేకపోవడం వల్ల కొనుగోలు ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే వేమ్ నరేందర్ రెడ్డిసహకారంతో తొర్రూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలోని గోదాంను వినియోగించుకునేందుకు అనుమతి లభించినట్లు వెల్లడించారు.
మండలంలో ప్రతి సంవత్సరం విస్తారంగా మొక్కజొన్న సాగు జరుగుతున్నప్పటికీ సరైన నిల్వ సదుపాయాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని సొంత ట్రాక్టర్ల ద్వారా గోదాములకు తరలించాలని సూచించారు. ట్రాక్టర్ కిరాయిలను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఈవో కాగిత శ్రీనివాస్, ప్రత్యేక అధికారి రమేష్, కార్యాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
