మెడికల్ కళాశాల కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలి
మెడికల్ కళాశాల కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలి
బి.ఆర్.టి.యూ జిల్లా అధ్యక్షుడు టైగర్ కృష్ణయ్య డిమాండ్
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, శానిటేషన్ కార్మికులకు రావాల్సిన 13 నెలల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని బి.ఆర్.టి.యూ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు టైగర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బుధవారం మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికులు తమకు రావాల్సిన జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టైగర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. కళాశాల యాజమాన్యం, జిల్లా అధికారులు జీతాల చెల్లింపులో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు.
జిల్లా కలెక్టర్ తివారి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ స్పందించి కార్మికులకు వెంటనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 13 నెలలుగా జీతాలు రాకపోవడంతో కార్మికులు కుటుంబ పోషణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు, పిల్లల పాఠశాల, కళాశాల ఫీజులు, నిత్యావసర ఖర్చులు భరించడం కష్టంగా మారిందన్నారు.
జీతాల విషయంలో పలుమార్లు కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మరియు అసెంబ్లీ స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. “జీతాలు వస్తాయి” అంటూ కాలయాపన చేస్తున్నారని, దీంతో కార్మికుల సమస్య మరింత తీవ్రమైందన్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు, కళాశాల యాజమాన్యం స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బి.ఆర్.టి.యూ జిల్లా కమిటీ, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జే. ఆనందం, బుజ్జమ్మ, జమలమ్మ, మైసమ్మ, అనూష, జంగమ్మ, విజయ, గౌరమ్మ, టి. విజయ, శంకరమ్మ, రాజేశ్వరి, కే. జయ, బి. సువర్ణ, తయ్యబ్ బేగం, టి. లక్ష్మి, నర్సింలు, విజయ్‌కుమార్, వెంకటేశం తదితర కార్మికులు పాల్గొన్నారు.
