అంకుర ఆసుపత్రిలో అగ్నిమాపక మాక్‌డ్రిల్
అంకుర ఆసుపత్రిలో అగ్నిమాపక మాక్‌డ్రిల్
ఆంధ్రప్రభ, విజయవాడ: విజయవాడ నగరంలోని అంకుర ఆసుపత్రిలో మంగళవారం ఫైర్ సర్వీస్ వీక్ కార్యక్రమాల్లో భాగంగా అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమం అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ చి. సూర్య ప్రకాశరావు ఆధ్వర్యంలో విజయవాడ అగ్నిమాపక కేంద్ర సిబ్బంది సమక్షంలో జరిగింది. మాక్‌డ్రిల్ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక పరికరాల వినియోగం, ప్రమాద సమయంలో భవనం నుంచి సురక్షితంగా బయటకు తరలింపు విధానాలు, ప్రాణాపాయ పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రాథమిక రక్షణ చర్యలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు.
ఆసుపత్రి వైద్య సిబ్బంది, నిర్వహణ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో ప్రాక్టికల్‌గా అవగాహన పొందారు. ఈ సందర్భంగా ఏడీఎఫ్‌వో సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ.. ఆసుపత్రులు వంటి జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో తరచూ మాక్‌డ్రిల్స్ నిర్వహించడం ద్వారా ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి, నిజ జీవిత ఘటనల సమయంలో వేగంగా స్పందించే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. రోగులు, వారి సహాయకులు, ఆసుపత్రి సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని సూచించారు. ఫైర్ సర్వీస్ విభాగం చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల్లో భద్రతా చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.
