మే డే స్ఫూర్తితో ఉద్యమిద్దాం
మే డే స్ఫూర్తితో ఉద్యమిద్దాం
- ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎంఏ రెహమాన్,
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి, కలెక్టరేట్ కార్యాలయం, కొత్త బస్టాండ్, పటాన్చెరు ఈఎస్ఐ హాస్పిటల్, బీహెచ్ఈఎల్ ఏఐటీయూసీ కార్యాలయం సహా పలు చోట్ల కార్మిక సంఘ నేతలు జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ రెహమాన్, జిల్లా కార్యదర్శి వెంకట్రాజ్యం సంయుక్తంగా మాట్లాడుతూ 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల పనిగంటల తగ్గింపు, కనీస వేతనాల అమలు, భద్రతా చర్యల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని స్మరించారు.
ఆ ఉద్యమంలో అనేక మంది కార్మికులు ప్రాణత్యాగాలు చేయడంతోనే ఎర్రజెండా పుట్టుక తీసుకుందని పేర్కొన్నారు. అనంతరం నేటి పరిస్థితులపై స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న పలు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడం ద్వారా పనిగంటలు పెంచడం, సమ్మె హక్కులను పరిమితం చేయడం వంటి చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. ఈ విధానాలు కార్మిక వర్గ ప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు.
అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, జాతీయ ఆస్తులను పెద్ద పెట్టుబడిదారులకు అప్పగించడం ద్వారా కార్మికులు, రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు బోయిన్ ప్రసాద్, సాయికుమార్, ఇర్ఫాన్, ప్రవీణ్ కుమార్, భానుచందర్, సయ్యద్ అబ్దుల్ సమద్, చంద్రశేఖర్, లక్ష్మి, పద్మ, రమణ రెడ్డి, బీహెచ్ఈఎల్ యూనియన్ కార్యదర్శి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
